అనర్హులు అని తేలితే నిర్మాణంలో ఉన్నా రద్దు చేస్తాం.. మంత్రి పొంగులేటి హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-10 16:30:59.0  )
అనర్హులు అని తేలితే నిర్మాణంలో ఉన్నా రద్దు చేస్తాం.. మంత్రి పొంగులేటి హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: జ‌న‌వ‌రి మూడో వారంలో నిర్వహించిన గ్రామ‌స‌భ‌ల్లో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిశీలించి ల‌బ్ధిదారుల‌ ఎంపిక ప్రక్రియ‌ చేప‌ట్టాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం స‌చివాల‌యంలో ఇందిర‌మ్మ ఇండ్లపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ జ‌న‌వ‌రి 26న ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసిన 562 గ్రామాల్లో ఎదురైన ప‌రిస్థితులు, మంచి చెడుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ‌ చేప‌ట్టాల‌ని సూచించారు. నిరుపేద‌ల‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

వీలైనంత మేర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అర్హుల‌కే ల‌భించేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఏ ద‌శ‌లో ఉన్నా అన‌ర్హుల‌ని తేలితే వాటిని ర‌ద్దుచేస్తామ‌ని ప్రక‌టించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడ‌మే ఈ ప్రభుత్వ ప్రధాన ల‌క్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇండ్ల కోసం నిరుపేద‌లు ఎదురుచూస్తున్నారని, వారి ఆశ‌లకు అనుగుణంగా అధికారులు ప‌నిచేయాలని సూచించారు. ఈ స‌మావేశంలో హౌసింగ్ స్పెష‌ల్ సెక్రెట‌రీ జ్యోతి బుద్ధా ప్రకాశ్, హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ వీపీ గౌత‌మ్ పాల్గొన్నారు.

Next Story