Ponguleti: ఇందిర‌మ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Ponguleti: ఇందిర‌మ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిర‌మ్మ ఇండ్ల(Indiramma indlu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ‌లో నిరుపేద‌లు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సొంతింటి క‌ల సాకారం కానుంది. పేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని ప్రభుత్వం సంక‌ల్పించిందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఈ ఇందిర‌మ్మ ఇండ్లకు ల‌బ్ధిదారుల‌ ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ఇండ్ల పథకం అమ‌లుకు ఉన్న అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తూ అమ‌లుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను వేగవంతం చేసిందని తెలిపారు.

“ఇల్లు లేని పేద‌ల‌కు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం, కాంగ్రెస్ అంటే ఇందిర‌మ్మ ఇండ్లు, ఇందిర‌మ్మ ఇండ్ల‌కు కాంగ్రెస్ పేటెంట్. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా, ఏమారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. మేం గర్వంగా చెబుతున్నాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని చెబుతున్నాం’ అని మంత్రి పొంగులేటి అన్నారు.

ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించనున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని భరోసా ఇచ్చారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు.

ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటాయి. గ‌త ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవ‌స్థ ఉండేది. ఇప్పుడు ఆవ్య‌వ‌స్ధ‌ను ర‌ద్దుచేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతామమని మంత్రి ప్రకటించారు.

Advertisement

Next Story