- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ మోడీని ప్రధాని పీఠమెక్కిస్తే.. అది దేశాన్ని బలిపీఠమేక్కించినట్టే: KTR
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అగ్రనేత అమిత్ షా చేవెళ్ళలో చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. త్వరలో అధికారంలోకి వస్తామని కలలుగంటున్న బీజేపీ అంధకారంలోకి వెళ్ళక తప్పదన్నారు. వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న ప్రధాని మోడీకి గుజరాతీ ఘర్ వాపసీ తప్పదన్నారు. ఆయనను మరోసారి ప్రధాని పీఠమెక్కిస్తే అది ప్రజల పాలిట బలిపీఠమవుతుందన్నారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతుల్లో ఉన్నదని, కార్పొరేట్ దోస్తుల కబంధహస్తాల్లో ఆ పార్టీ చిక్కుకున్నదన్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో బీజేపీ ఫుల్ పిక్చర్ ఏంటే దేశంలోని ప్రజలంతా 700 ఎంఎంలోనే చూశారని, ఇక ఏ ట్రైలర్ అవసరం లేదన్నారు. చేవెళ్ళలో అమిత్ షా ప్రసంగం తర్వాత కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పై కామెంట్లు చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నట్లు బీజేపీ కలలు కంటున్నదని, రాష్ట్రంలో బీజేపీ ఖాళీ కావడం మాత్రమే కాదు.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ కూడా ఖాళీ అవుతుందన్నారు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మోడీ గుజరాత్‌కి వాపస్ వెళ్ళడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ పగటి వేషాలు నడవవని, ఢిల్లీ పెద్దల కలలు కూడా నెరవేరవన్నారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నా దానికి సిద్ధం కాని బీజేపీ ఇప్పుడు తెలంగాణలో పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ జడ్జి విచారణకు అడిగే హక్కు లేదన్నారు. ముక్కు నేలకు రాసినా, మోకాళ్ళ యాత్ర చేసినా మోసాల మోడీని తెలంగాణ ప్రజలు నమ్మరని, బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదన్నారు.
దేశంలోని అవినీతికి కెప్టెన్ నరేంద్ర మోడీ అని కామెంట్ చేసిన కేటీఆర్.. బీజేపీకి దానికి కేరాఫ్ అడ్రస్ అన్నారు. మజ్లిస్ భుజంమీద తుప్పు పట్టిన తుపాకీతో బీజేపీ కాల్చాలనుకుంటున్నదని, ఎంతకాలం ఈ నాటకం అని అన్నారు. తెలంగాణలో సొంత బలం లేని బీజేపీ అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. పల్లెపల్లెనా బలగం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కేంద్ర నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని చెప్పే అమిత్ షా.. తొలుత రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న డబ్బుల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వడంలేదని, అలాంటి బీజేపీకి చివరకు మిగిలేది బూడిదేనని అన్నారు. నిస్సిగ్గుగా సుద్దులు చెప్పడం ఆ పార్టీకే చెల్లిందన్నారు.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయని బీజేపీ నేతలు అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా హోం మంత్రిగా ఉన్నారని, అప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ నెంబర్ వన్‌గా ఉన్నమాట నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. గడచిన ఎనిమిదేళ్లలో గుజరాత్‌లో 13 సార్లు పేపర్లు లీక్ అయ్యాయన్నారు. ఈ దేశంలోనే వ్యాపం లాంటి అతి జుగుప్సాకరమైన స్కాంకు పాల్పడింది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.
‘పీఎం కేర్స్’ నిధికి ఎంత జమ అయిందీ, ఆ డబ్బులను ఎలా ఖర్చు చేశారో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కాగ్’ ఆడిట్‌కు ‘పీఎం కేర్స్’ అతీతమైనదంటూ సుప్రీంకోర్టులో నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొత్తుకుంటున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తెలంగాణకు వచ్చి గులాములు రాసిచ్చిన స్క్రిప్టును చదివి వెళ్ళిపోతారని, కానీ తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
తెలంగాణకు ప్రధాని లేదా కేంద్ర మంత్రులు వస్తే రాష్ట్ర అభివృద్ధి పనులకు లేదా విభజన చట్టంలోని హామీల అమలుకు లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు స్పందనగా వస్తారని భావిస్తామని.. కానీ అమిత్ షా ప్రసంగం చూసిన తర్వాత నవ్వొస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయలేదని, పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, హైదరాబాద్ మెట్రో రెండో దశపై తేల్చలేదని గుర్తుచేశారు. ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా అంటూ సవాలు విసిరారు.