Kagaznagar: రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి కొండా సురేఖ

by Gantepaka Srikanth |
Kagaznagar: రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీమ్ ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లా కాగజ్ నగర్‌(Kagaznagar)లోని ఈజ్గాంలో పులి(Tiger) దాడి ఘటనలో మరణించిన గన్నారం మండల వాసి కళ్యాణి కుటుంబానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. పత్తి సేకరణకు వెళ్లిన కళ్యాణి పులి దాడిలో మరణించడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. శాఖాపరంగా అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

ఇవాళ సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడెంలో సురేష్ అనే రైతుపై మరో దాడి ఘటన జరగడంతో మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నీరజ్‌ రైతు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా హాస్పిటల్‌కు సురేష్‌ను తరలిస్తున్నట్టు డీఎఫ్ఓ మంత్రికి వివరించారు. ప్రస్తుతం పులి కదలికలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డీఎఫ్ఓ మంత్రికి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పశువులపై కూడా పులి దాడి ఘటనలు నమోదైన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పీసీసీఎఫ్‌ను ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలనీ, అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

పులి సంచారానికి సంబంధించిన జాడలు కనిపించడం, పులిని చూసినట్లుగా ఎవరైనా సమాచారం అందించిన పక్షంలో సమీప ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని అటవీ అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలని అటవీ అధికారులను నిర్దేశించారు. రాకపోకల సందర్భంగా పులి నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించిన పరిస్థితుల్లో పులి దాడి నుంచి బయటపడడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సురేఖ అటవీ అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement

Next Story