ఒక కులాన్ని టార్గెట్ చేసి తిట్టడం బాగోలేదు.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-04 12:48:04.0  )
ఒక కులాన్ని టార్గెట్ చేసి తిట్టడం బాగోలేదు.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న(చింతపండు నవీన్ కుమార్) వ్యవహార శైలి తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో తీవ్ర దుమారం రేపుతోంది. సొంత పార్టీ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు.. కాంగ్రెస్‌లో ఒక సామాజికవర్గం బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తోందని తీన్మార్ మలన్న ఆరోపించారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలవనీయకుండా ఆ సామాజికవర్గం తీవ్ర ప్రయత్నాలు చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా.. తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందించారు. మంగళవారం కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములను వ్యక్తులు కాదు ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న బీ-ఫాం నాకే ఇచ్చారు.. పెద్ద ర్యాలీ చేసాం.. అన్ని వర్గాలను మెప్పించి గెలిపించుకున్నాం.. జిల్లాలో మంత్రిగా ఉండి ఎమ్మెల్సీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? అని కోమటిరెడ్డి అన్నారు. ఆయన బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను తిట్టడం కరెక్ట్ కాదు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్(Congress) గొప్ప నిర్ణయం తీసుకున్నదని అన్నారు. కాంగ్రెస్ బీ-ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న తమపై, ప్రభుత్వంపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగతంగా నన్ను తిడితే స్వాగతిస్తా.. కానీ ఒక కులాన్ని టార్గెట్ చేసిన తిట్టడం బాగోలేదని సీరియస్ అయ్యారు.

ఇక కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) ఆస్తులు రాయాలంటే ఒక బుక్ లెట్ కావాలని సెటైర్ వేశారు. అందుకే సర్వేలో కవిత మినహా కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన(Caste Census) సర్వే నివేదికను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. కేంద్రం ఓకే అంటే ఓకే.. లేదంటే మా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు సభలో తీర్మానం చేస్తాం.. ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెలలోనే మరో రోజు సభ పెడుతామని అన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) నాకే కాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి కూడా దగ్గరి వ్యక్తే అని అన్నారు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అందరికీ గౌరవం ఇస్తున్నారు. రోజూ నన్ను కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కలుస్తారు. అలాగే అనిరుధ్ రెడ్డి కూడా కలిశారు. కానీ అనిరుధ్ రెడ్డి ఏ భూమి(Land) గురించి అడగలేదని స్పష్టం చేశారు.

Next Story