Toyota Motor: 2027 నాటికి మొదటి ఆర్అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేయనున్న టయోటా

by S Gopi |
Toyota Motor: 2027 నాటికి మొదటి ఆర్అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేయనున్న టయోటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా మొటార్స్ కార్పొరేషన్ భారత్‌లో తన మొదటి ఆర్అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, దేశీయంగా ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బెంగళూరులో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ ఫ్యాక్టరీకి సమీపంలో ఈ ఆర్అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా, ప్రారంభంలో 200 మంది ఇంజనీర్లతో కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 2027 నాటికి 1,000 మందిని తీసుకోనున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. భారత్‌ను క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా గుర్తిస్తూ టయోటా దేశంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం దేశీయంగా టయోటా సాంప్రదాయ ఇంధన కార్లను విక్రయిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలోకి అడుగుపెట్టలేదు. మారుతీ సుజుకితో కలిసి ఆర్అండ్‌డీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ అనుభవం ద్వారా సొంత ఆర్అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో 2010లోనూ టయోటా దేశీయంగా ఆర్అండ్‌డీని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు.

Next Story