మత్తులో తూగుతున్న యువత...

by Naveena |   ( Updated:2025-03-21 16:44:40.0  )
మత్తులో తూగుతున్న యువత...
X

దిశ, కామారెడ్డి : సినిమాల ప్రభావమో... లేక నయా ట్రెండ్ అనే మోజులో పడి మోసపోతూ తమ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నామో తెలియని స్థితిలో యువత కొట్టుమిట్టాడుతోంది. యువత చెడు దారిన పట్టకుండా కాపాడాల్సిన తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందని జిల్లాలో జరుగుతున్న పలు సంఘటనలే ఇందుకు ఉదాహరణ గా పలువురు చర్చించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, పలు హత్యలు, అత్యాచారాలు కూడా మత్తులోనే చేసినట్లుగా స్పష్టమవుతుంది. రోజుకో చోట ఎక్కడో సంఘటన మద్యం మత్తులోనే యువత చేస్తున్నారంటే వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుండడం తోటే దాన్ని కొనుగోలు చేసి వాడుతూ అనారోగ్యాల పాలవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు పలుమార్లు గంజాయి విక్రయాలను పట్టుకొని నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ విక్రయాలు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో యువత గంజాయి తో పాటు పలు రకాల మత్తు పదార్థాలకు బానిసలై తమ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు గొడవలు పడుతున్నారని పలువురు అంటున్నారు. ఇటీవల గాంధారిలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను మత్తుతో కారు నడుపుతూ అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొనడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంఘటన విధితమే. ఇలా ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలు దాదాపు మత్తు లోని జరుగుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

యథేచ్ఛగా మత్తును స్వీకరిస్తున్న వైనం...

మత్తు మందులు అయిన మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాలకు యువత బానిస అవుతుంది. వీటిని సేవించిన వారు స్పర్శలో ఉండకపోవడంతో.. వారు చేసేది కళ్ళకు కనిపించక ఎదుటివారి ప్రాణాలను హరిస్తున్నారనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళితే ఎవరు ఎలా వచ్చి తమ ప్రాణాలను బలి తీసుకుంటారోనని భయపడుతున్నారు.

కాపాడాల్సిన పోలీసులకే రక్షణ కరువైతే...

కంటికి రెప్పలా కాపాడాల్సిన పోలీసులకే రక్షణ కరువైతే ఇక తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాంధారి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మత్తుకు బానిస అయిన వారికి పోలీసులు, సాధారణ ప్రజలు ఉన్నారని ఇంగీతం మార్చిపోతుండడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సినిమాలను చూసి బానిస అవుతున్న వైనం...

పాత, కొత్త సినిమాలను చూసి అందులో విలన్లు సేవిస్తున్న మత్తుపదార్థాలకు యువత ఆకర్షితులై తమ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. వాళ్లు చేసేది అంతా డూప్ అని తెలియక తాము కూడా అలాగే చేస్తే అదోరకమైన మత్తు ఉంటుందనే పిచ్చి ఆలోచనలో పడి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నట్లుగా తెలుస్తుంది. సిగరెట్లలో ఉన్న పొగాకును తొలగించి అందులో గంజాయిని నింపుకొని తాగడం ఒక అలవాటుగా చేసుకుంటున్నారు.

విరివిగా లభ్యమవుతున్న హుక్కా మిషన్లు

సిగరెట్లలో ఉన్న పొగాకును తొలగించి అందులో గంజాయిని నింపుకొని కొంతమంది తాగుతుండగా మరికొందరు మాత్రం ఏకంగా హుక్కా మిషన్లను కొనుగోలు చేసి వాటిలో గంజాయి నింపుకొని తాగుతున్నట్లుగా తెలుస్తోంది. హుక్కా మిషన్లు కూడా ఇలాంటి చెడు వ్యాసాలు ఉన్నవారికి విరివిగా లభ్యమవుతుండడంతో.. వాటిని కొనుగోలు చేస్తూ వారికి అనువైన స్థలంలో ఉంచుకొని గంజాయిని తాగుతున్నారనే సమాచారం.

యువతను అనుసరిస్తున్న మైనర్లు...

మత్తుకు బానిసలు అయిన యువతను వారి చుట్టుపక్కల ఉండే మైనర్లు కూడా అనుసరిస్తూ మత్తుకు బానిసలు అవుతున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డికి ఆనుకొని ఉన్న ఓ గ్రామంలో ఇటీవల హుక్కా మిషన్ కొనుగోలు చేసి యువత గంజాయిని సేవిస్తుండగా.. వారిని అనుసరించిన కొంతమంది మైనర్లు కూడా ఈ విషయం తెలుసుకుని హుక్కా మిషన్ తో మత్తును పీల్చినట్లుగా తెలుస్తోంది. కాస్త ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మందలించినట్లుగా సమాచారం. దీంతో వారి స్థావరాన్ని మరోచోటకు మార్చినట్లుగా తెలుస్తోంది.

మత్తు బానిసలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి...

చెడు వ్యసనాలకు పలు రకాల మత్తుకు బానిస అయిన వారిని గుర్తించి పోలీసులు, వైద్యులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని చెడు మార్గంలో నుంచి మంచి నడవడికలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కు పాదం మోపి వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తే మరోసారి మత్తు పదార్థాలు తీసుకోవడానికి భయపడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Next Story

Most Viewed