తెలంగాణ కేబినెట్ విస్తరణపై BIG అప్‌డేట్

by Gantepaka Srikanth |
తెలంగాణ కేబినెట్ విస్తరణపై BIG అప్‌డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని, ఆ మేరకు తమకు సంకేతాలు వచ్చాయని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో పలువురు ఆశావహులు చేసిన చిట్‌చాట్‌లలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సెషన్స్ ముగిశాక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి విస్తరణకు ముహూర్తం, జాబితా ఖరారు చేసుకుని వస్తారని అంచనా వేస్తున్నారు. విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధిష్టానం సైతం రెడీగా ఉన్నదని ప్రస్తావించారు. అన్ని వర్గాలు, జిల్లాలు, హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపకం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఉగాది తర్వాత అందరికీ మంచి రోజులు : రాజగోపాల్ రెడ్డి

ఉగాది తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయని, కేబినెట్ విస్తరణ జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త, పాత మంత్రులు అందరూ కలిసి పని చేయనున్నట్టు వ్యాఖ్యానించారు. అప్పుడు మరింత సమర్ధవంతమైన పాలన ప్రజలకు అందుతుందని కామెంట్ చేశారు. అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబపాలనను తరమికొట్టాలనే తన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తయిందన్నారు. ఆర్థికశాఖ మంత్రి హోదాలో భట్టి విక్రమార్క కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులను కేటాయిస్తున్నారని తెలియజేశారు.

మొదటి వారంలో విస్తరణ : సుదర్శన్ రెడ్డి

వచ్చేనెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తానని కామెంట్ చేశారు. గతంలో వైద్యశాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖల బాధ్యతలు నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఆ శాఖల్లోని లోటుపాట్లను ఆధ్యయనం చేసి గాడిలో పెట్టానని వివరించారు. ‘హోం మంత్రి పదవి మీకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది కదా?’ అనే ప్రశ్నకు.. ఏ శాఖ ఇచ్చినా రూల్స్ ప్రకారం పనిచేసే వ్యక్తిత్వం తనదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో సగం జనాభాను గుర్తించండి : మల్‌రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సగం జనాభా జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, ఆ ప్రాంతానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్ విస్తరణలో ప్రయారిటీ ఇవ్వాలన్నారు. మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్​పదవి ఆయనకు రేవంత్ ఆఫర్ చేయగా.. తనకు మంత్రి పదవి తప్ప మరొకటి అవసరం లేదని ఆయన స్పష్టంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈసారి విస్తరణలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story