Minister Komatireddy: అసలు పురోగతేం కనిపించడం లేదు.. అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

by Gantepaka Srikanth |
Minister Komatireddy: అసలు పురోగతేం కనిపించడం లేదు.. అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. డిపార్ట్ మెంట్‌లో సర్వీస్ రూల్స్ కావాలంటే తెచ్చా, ట్రాన్స్ ఫర్లు చేసుకుంటామంటే అనుమతించా.. మీరు ఏదడిగితే అది చేస్తున్నప్పటికీ.. మీ పనితీరు ఏం మెరుగుపడలేదని మండిపడ్డారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్ & బీలోని వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి శాఖలో కొందరు అధికారుల అలసత్వంపై తీవ్రంగా స్పందించారు.

ముందుగా వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్ పోర్ట్‌(Mamnoor Airport)పై ఎవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఆర్ & బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. త్వరితగతిన భూసేకరణ చేపట్టి రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక ఏర్పట్లకన్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని చెప్పిన మంత్రి.. గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెళ్లబుచ్చితే అర్ధం లేదన్నారు. ప్రజలకు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే జవాబుదారితనంతో కూడిన పాలన అందించవచ్చని తేల్చిచెప్పారు. విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఏవియేషన్ డైరెక్టర్ ఉన్నతాధికారులకు సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్‌ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధంచేయాలని ఆదేశించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్, రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా వంటి పారిశ్రామిక ప్రాంతాలున్న దృష్ట్యా.. అందుకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని సూచన చేశారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానన్న చెప్పిన మంత్రి రివ్యూలో పాల్గొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకొని పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు.

టిమ్స్ హాస్పిటల్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుంది :

ప్రతీ రివ్యూలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు ప్రారంభించే టైం పెంచడం తప్పా ఇప్పటిదాక ఏం పురోగతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో ఇప్పటిదాక ఒక్క పురోగతిని చూపించలేదని అన్నారు. ప్రజలు ప్రాథమిక అవసరమైన హాస్పిటల్స్ నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం దేనికని ప్రశ్నించారు. ప్రభుత్వం దవాఖానాలు అందుబాటులోకి రాకపోతే పేద ప్రజలు కార్పోరేట్ హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్సలు తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకుంటారని.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రిగారితో, ఉప ముఖ్యమంత్రిగారితో మీ ముందే మాట్లాడి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాను.. అయినా ఎందుకు నిర్మాణాలు ఆలస్యం జరుగుతున్నాయని ఆయన నిలదీశారు. రోజు వేలాదిమంది వచ్చే నిమ్స్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే.. మీరంతా ఏం చేస్తున్నారని పశ్నించారు. ఇప్పటికైనా అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే జూలై, 2025 నాటికి టిమ్స్ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed