ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి

by karthikeya |   ( Updated:2024-10-11 07:34:10.0  )
ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పారని, మరి ఎందుకు అందించలేకపోయారని నిలదీశారు. నల్లగొండలో ఇంటిగ్రేటెడ్ స్కూ్ల్ భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రతి విద్యార్థికి విద్యనందించగలుగుతామన్నారు. ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అప్పట్లో కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా అందిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల హామీని కూడా అమలు చేస్తున్నామన్నారు.

అసలేంటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు..?

ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనేదే ఈ సమీకృత కాంప్లెక్సుల ముఖ్య ఉద్దేశం. 20-25 ఎకరాల విస్తీర్ణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, మెస్‌లు, లైబ్రరీ, స్టేడియం, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్విమ్మింగ్ పూల్... ఇలాంటి అన్ని సదుపాయాలన్నీ ఉండేలా ఈ స్కూళ్లను నిర్మించబోతోంది ప్రభుత్వం. 2000 నుంచి 2500 వరకు విద్యార్థులు ఈ స్కూళ్లలో విద్యనభ్యసిస్తారు. అలాగే విద్యార్థులకు బోధన చేసేందుకు 150 మంది వరకు టీచర్లు ఈ స్కూళ్లలో ఉంటారు. ఈ స్కూళ్ల ద్వారా ద్వారా మెరుగైన, నాణ్యమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed