విశ్వవ్యాప్తంగా తెలంగాణ ప‌ర్యాట‌కం.. లండన్‌లో ప్రత్యేక స్టాల్‌

by srinivas |
విశ్వవ్యాప్తంగా తెలంగాణ ప‌ర్యాట‌కం.. లండన్‌లో ప్రత్యేక స్టాల్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని వెల్లడించారు. ‘సాంకేతిక ప‌రిజ్ఞానం - ప‌ర్యాట‌క రంగానికి మేలు చేసే అవ‌కాశాలు’ థీమ్‌తో లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44 వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ ( ప్రపంచ పర్యాటక ప్రదర్శన) మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ని పర్యాటక సంస్థ అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేలా తెలంగాణ ప‌ర్యాట‌క అందాలు, చారిత్రక‌ ప్రదేశాల ఛాయ‌చిత్రాల‌ను డిజిటల్ స్క్రీన్ లో ప‌ర్యాట‌క శాఖ ప్రద‌ర్శించింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్యాట‌క రంగ‌పై ప్రత్యేక దృష్టి సారించ‌డంతో ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందన్నారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్రత్యేక కార్యచ‌ర‌ణ‌తో ముందుకెళ్లుతున్నట్లు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. అనంతరం ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవంలో యూకే లో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ ఆల్యూర్ రెహమాన్ తో జూపల్లి భేటీ అయ్యారు. పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగంగా విదేశీ పెట్టుబడులు, హైదరాబాద్‌లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో హైదరాబాద్ లో జాయింట్ వీల్ ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు.

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న కార్యక్రమాలను, తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వివరించారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా 125 దేశాలు, భార‌త్ నుంచి 10 పైగా రాష్ట్రాలు ఈ ప్రద‌ర్శన‌లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మెహ‌న్ రెడ్డి, రాజేష్ రెడ్డి, క‌సిరెడ్డి నారాయ‌ణరెడ్డి, డా.వంశీకృష్ణ, అనిరుధ్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story