నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్ రావు

by Vinod kumar |
Minister Harish Rao Demands to Respond Kishan Reddy Over Paddy Procurement
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో మరో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. మంగళవారం ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఇ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు గణనీయంగా పెరిగాయి. డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయి. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదు అయ్యాయి. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు”అంటూ మంత్రి హరీష్​ రావు పేర్కొన్నారు.

కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగటం, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగటం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు మొదలు పెట్టడం వల్ల ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందన్నారు. ఆరోగ్య శ్రీ బృందంతో పాటు, ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందన్నారు. ఇహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వెల్నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మంత్రి నిర్వహించిన జూమ్ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఇ రమేష్ రెడ్డి, నిమ్స్, ఎంఎన్జే డైరెక్టర్లు, ఆరోగ్య శ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీం లీడర్లు, అన్ని టీచింగ్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed