తెలంగాణ మహిళలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక

by GSrikanth |
తెలంగాణ మహిళలకు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాణ్యత లేని బతుకమ్మ చీరలను ఎలా కట్టుకోవాలంటూ ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థంతో ఎవరైనా బతుకమ్మ చీరలను మంటల్లో కాలిస్తే అలాంటివారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణపై హనుమకొండ కలెక్టరేట్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ అని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఈ చీరలను అందిస్తున్నదన్నారు. ఈ చీరలకు వెల కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రేషన్ షాపులు, రెవెన్యూ కార్యాలయాలు, కమ్యూనిటీహాళ్ల వేదికగా ఇప్పటికే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అయితే నాణ్యత అస్సలు బాగోలేదని కొన్ని చోట్ల మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు కట్టుకోవడానికి పనికిరావంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళలు 20 చీరలను తగలబెట్టారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం మహిళలకు కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కార్ ఇప్పటికే తెలిపింది.

Advertisement

Next Story