Minister Damodara: దోపిడీ చేసే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: డీఎంహెచ్‌వోలకు మంత్రి దామోదర ఆదేశం

by Shiva |
Minister Damodara: దోపిడీ చేసే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: డీఎంహెచ్‌వోలకు మంత్రి దామోదర ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డెంగీ పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్‌ను వదలొద్దని కీలక ఆదేశలు జారీ చేశారు. డెంగీ పేరిట దోపిడీ ఎక్కువైందని, డైలీ ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి డెంగీ దోడిపీని నియంత్రించాలన్నారు. పేషెంట్లు ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వోలు ఫీల్డ్‌లోకి దిగి సీరియస్‌గా వర్క్ చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. మరో వైపు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఎలిసా టెస్టులు చేయకుండా కేవలం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగీ కన్ఫామ్ అంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, అలాంటి దవాఖాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇక సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వేని నిర్వహించి బాధితుల రక్త నమూనాలను వెంటనే సేకరించాలన్నారు. పాజిటివ్ తేలిన బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి నీటి నిల్వ కుంటలలో, చెరువులలో ఆయిల్ బాల్స్‌ను వదలాలని సూచించారు. సీజనల్ వ్యాధుల రిపోర్ట్ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు తనకు అందించాలని మంత్రి ఆదేశించారు. మరో‌వైపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నిర్ధారణకు అన్ని రకాల టెస్టులు, రక్త పరీక్షలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇక కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని డీఎంఈకి సూచించారు. జీవన్‌దాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మరింత ప్రోత్సహించేలా అవగాహన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed