- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సీ వర్గీకరణ చట్టంతో కొత్త చరిత్ర రాయబోతున్నాం.. మంత్రి దామోదర కీలక హామీ

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో (SC classification) ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తాం.. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో కొత్త చరిత్ర రాయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు మంత్రి దామోదర, నాయకులు కడిగారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున మంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయని అన్నారు. హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందని, జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని వెల్లడించారు.
ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిదన్నారు. హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయ రంగు పూయకూడదని, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వర్గీకరణ విషయంలో అదే జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని వెల్లడించారు. మాదిగల పట్ల అది ఆయన నిబద్ధత, పేదల హక్కుల పట్ల చిత్తశుద్ధి.. అని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుకూలంగా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేలా అన్ని విధాల అధ్యయనం చేసిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, అందులో వంకలు పెట్టడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. వర్గీకరణపై అబద్ధాలు, మోసం, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దన్నారు. మీకు ఎక్కడ అవసరమున్నా, ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అని హామీ ఇచ్చారు.