ఆ వివాదంలోకి మంత్రి, కలెక్టర్‌.. గుట్టుగా ఇరికించిన ఏజెంట్లు (సంభాషణ ఇదే)!

by GSrikanth |   ( Updated:2022-09-01 04:00:47.0  )
ఆ వివాదంలోకి మంత్రి, కలెక్టర్‌.. గుట్టుగా ఇరికించిన ఏజెంట్లు (సంభాషణ ఇదే)!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీకు లావుణీ పట్టా భూమి ఉందా? అసైన్డ్ భూమి భూమి ఉందా? దానిని అమ్మాలనుకుంటున్నారా? కొనేవారు సిద్ధంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర వ్యవహారాలన్నీ వాళ్లే చూసుకుంటారు. కాకపోతే బహిరంగ మార్కెట్ ధరలో 40 శాతమే దక్కుతుంది. ఎన్వోసీ, మ్యుటేషన్, పట్టా మార్పిడి ఇలా అన్ని పనులు వాళ్లే చేసుకుంటారు. మీరు, డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొస్తే చాలు. తొలుత అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మిగతా పనులు చేసి మళ్లీ పిలుస్తారు ఇదంతా నిజమేనండి! అసైన్డ్ భూమి అమ్మడం ఎట్లా? అనే అనుమానాలొద్దు. కొనుగోలు చేస్తామంటూ ముందుకొస్తున్న ముఠాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కొనేశామంటున్నారు. హైదరాబాద్ ​పరిసరాలలో, ప్రధానంగా హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్న వాటికే డిమాండ్. ఎకరం పట్టా భూమి ధర రూ.60 కోట్లకు చేరింది. అందుకే ఇప్పుడు అగ్గువకు కొట్టేసేందుకు అసైన్డ్ భూములపై పడ్డారు.

వివాదాలు ఉన్నా

ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమ దందాలు సాగించాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడేమో ఏకంగా నిషేధిత భూములను కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఏజెంట్లు మార్కెట్లో తిరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వాట్సాప్ గ్రూపులలో నేరుగా లావోణీ పట్టా భూములు కొంటామంటూ ఫోన్ నంబర్లు పోస్టు చేస్తున్నారు. సదరు ఏజెంట్ల వెనుక బలమైన శక్తులే ఉన్నాయని వారి మాటలే చెబుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో మిగిలిన అసైన్డ్ భూములను కూడా కైంకర్యం చేసేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందు కోసం నగరంలోని పలు ప్రాంతాలలో ఆఫీసులను తెరిచినట్లు అర్ధమవుతున్నది. ఇప్పటికే గండిపేట, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, శంషాబాద్​, రాజేంద్రనగర్​, గుండ్లపోచంపల్లి తదితర మండలాలలో లావోణీ పట్టా భూములు కొనుగోలు చేసినట్లు ఏజెంట్లు స్పష్టం చేశారు. ఎంత భూమి అయినా కొనేందుకు రెడీ అంటూ భరోసా ఇస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది.

ఎట్లెట్లా మారుస్తారు?

లావోణీ పట్టా భూములు రిజిస్ట్రేషన్ కావు కదా? మీరెట్లా కొనుగోలు చేస్తారు? అన్న ప్రశ్నలకు ఎలాంటి సంకోచం లేకుండా గడగడా సమాధానాలు ఇస్తున్నారు. అన్నీ క్లియర్‌గా ఉండాలి. డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు యజమాని వస్తే చాలు. అన్నీ పరిశీలించుకొని అగ్రిమెంట్లు చేసుకుంటామంటున్నారు. కలెక్టర్ కూడా ఫీల్డ్‌కి వచ్చి చూస్తారు. ఎన్వోసీ ఇచ్చేస్తారు. అదీ కుదరకపోతే హెచ్​ఎండీఏలో కలిపేస్తాం. అంటున్నారు. అదేందని అడిగితే ఆ భూమిలోనే లే అవుట్ చేసేస్తాం. హెచ్​ఎండీఏ పర్మిషన్ ఇస్తుందంటున్నారు. ఆ తర్వాత ప్లాట్లుగా అమ్మేస్తారని చెబుతున్నారు. లావోణీ పట్టాను పట్టా భూమిగా మార్చేస్తారంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్ని భూములను అక్రమంగా మార్చారో లెక్కలు తీస్తే తప్ప తెలియదు. పైగా కొనుగోలు చేసే టీం వెనుక ఓ మంత్రి ఉన్నట్లుగా ఏజెంట్ బద్నాం చేయడం గమనార్హం. అంతా ఆయనే చూసుకుంటారని చెప్పాడు.

ఖరీదైనవే కావాలి

ఏజెంట్‌తో మాటలు కలిపిన 'దిశ'తమకు కేశంపేటలో అసైన్డ్ భూమి నాలుగు ఎకరాలు ఉందని చెప్పింది. మార్కెట్ విలువ ఎకరం కనీసం రూ. రెండు కోట్లయినా ఉండాలి. అప్పుడే కొనుగోలు చేస్తామన్నారు. ప్లాట్లు చేసి అమ్మేటట్లు, భవనాలు కట్టి ఫ్లాట్లు విక్రయించేటట్లుగా ఉండాలని సూచించారు. అప్పుడు గండిపేట మండలం వట్టినాగులపల్లి ఏరియాలో ఏమైనా కొనుగోలు చేశారా? అని అడిగితే చాలా కొన్నామని బదులిచ్చారు. బహిరంగ మార్కెట్ విలువలో 40 శాతం వరకు ఇస్తామన్నారు. అందుకు సిద్ధమైతేనే డీల్‌కి రావాలన్న షరతు పెట్టారు. ఎవరైనా యజమానిని తీసుకొస్తేనే మాట్లాడుతామన్నారు. రూ.కోట్ల టర్నోవర్ వెనుక పెద్దలే ఉన్నట్లు ఏజెంట్లు స్పష్టం చేస్తున్నారు. తాము పది శాతం కమీషన్ కోసమే పని చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా కబ్జాలు ఉంటే కూడా తాము పని చేస్తామన్న మాటల వెనుక ధైర్యం ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారుతున్నది.

ఏజెంట్ తో 'దిశ'సంభాషణ (బాక్స్)

దిశ: మీరు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు కదా? లావోణీ భూమి ఎట్లా కొంటారు? రిజిస్ట్రేషన్ కాదు కదా! రికార్డు మారుస్తరా?

ఏజెంట్: అదంతా మేం చూసుకుంటం. మా సార్ వాళ్లు చేస్తరు.

దిశ: పెద్దవాళ్లు ఉన్నారా?

ఏజెంట్: మంత్రి ఉన్నారు.

దిశ: ఆ సార్‌తో పాటు ఎవరెవరు ఉన్నారు?

ఏజెంట్: ఆయనొక్కడే ఉంటడు. ఆయనదే రాజ్యం కదా?

దిశ: మరి ఎట్లా రావాలి?

ఏజెంట్ : పని కావాలంటే పేపర్లు, ఓనరును తీసుకొని రావాలి. లొకేషన్, ఫొటోలు తీసుకురావాలి. లొకేషన్‌కి కలెక్టర్ కూడా వస్తడు.

దిశ: కలెక్టర్ కూడా వస్తడా?

ఏజెంట్: అవును మరి. ఎన్వోసీ ఇవ్వాల్నాయే. మ్యుటేషన్ చేయాల్నాయే

దిశ: మరి ఎట్ల లెక్క?

ఏజెంట్​: 60:40. ఓనర్‌కి 40. మేం చేసినందుకు 10 తీసుకుంటం

దిశ: మీ ఒక్కరికే 10 శాతమా?

ఏజెంట్: నా మీద ఇంక ముగ్గురు ఉంటరు.

దిశ: రియల్​ఎస్టేటేనా? ఇంకేమైనా చేస్తరా?

ఏజెంట్: ఎక్కడైనా కబ్జాలు ఉన్నా చేస్తం. మీరు ఎక్కడుంటరు?

ఇలా 'దిశ'తో ఏజెంట్ అనేక విషయాలను మాట్లాడాడు. ఈ ఏజెంట్‌కి మల్కాజిగిరిలో ఆఫీసు ఉన్నట్లు చెప్పాడు.

Also Read : ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ సర్కిల్ 3లో అక్రమ నిర్మాణాల జోరు

Advertisement

Next Story