కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు.. కట్టడి టార్గెట్‌గా ‌రంగంలోకి KCR

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-25 07:50:04.0  )
కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు.. కట్టడి టార్గెట్‌గా ‌రంగంలోకి KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో/తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో కారు పార్టీలో అలజడి మొదలైంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పగా అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పార్టీకి డ్యామేజీ తప్పదని భావిస్తున్న కేసీఆర్.. వలసలను కట్టడి చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా ఇవాళ మధ్యాహ్నం వరకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితో సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ, వలసల కట్టడి విషయంలో చర్చించబోతున్నట్లు సమాచారం.

ఫామ్‌హౌస్‌లోనే కేటీఆర్, హరీశ్‌రావు..

అధికారంలో ఉండగా వలసలను ప్రోత్సహించిన గులాబీ బాస్ కేసీఆర్‌కు అవే వలసలు ఇప్పుడు ఝలక్ ఇస్తున్నాయి. ఇన్నాళ్లు తమకు సన్నిహితులు అన్నుకన్నవారంతా పార్టీకి గుడ్ బై చెబుతుండటం గులాబీ పార్టీలో అయోమయానికి దారి తీస్తోంది. అసెంబ్లీ సెషన్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిందనే ప్రచారం నేపథ్యంలో దీన్ని నివారించేందుకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావులు ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌తో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలతో అలర్ట్ అయిన కేసీఆర్ ఇవాళ అత్యవసరంగా సమావేశం అయి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా గులాబీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నదనేది ఆసక్తిగా మారింది.

ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఢిల్లీలో ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారుతానే ప్రచారం గతకొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఢిల్లీలో ఉన్న సమయంలోనే మహిపాల్‌రెడ్డి సైతం హస్తినకు వెళ్లడం చర్చకు దారితీసింది. అయితే తన ఢిల్లీ పర్యటనపై ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు వ్యవహారంలో భాగంగా అడ్వకేట్ నిరంజన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చానని తెలిపారు. ఈడీ రెయిడ్స్ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించేందుకు వచ్చానని ఇవాళ్టి కేసీఆర్ మీటింగ్ సమాచారం తనకు తెలియదని వెల్లడించారు. ఓవైపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మీటింగ్ నిర్వహిస్తున్న వేళ అధినేత మీటింగ్ సమాచారం తనకు తెలియదనడం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం అక్కడే ఉండటంతో మహిపాల్‌రెడ్డి వ్యవహారం ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed