అందరి చూపు చౌదరిగూడ వైపు...!

by Sumithra |
అందరి చూపు చౌదరిగూడ వైపు...!
X

దిశ, ఘట్కేసర్ : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ పంచాయతీ ఏర్పాటు అనంతరం చౌదరిగూడ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇదే పంచాయతీకి సర్పంచ్ లుగా బైరు రాములు గౌడ్ రెండు సార్లు, ప్రస్తుత సర్పంచ్ రమాదేవి రెండుసార్లు సర్పంచిగా ఎన్నికయ్యారు. 2000 మంది ఓటర్లతో ప్రారంభమైన చౌదరిగుడ గ్రామపంచాయతీలో నేడు దాదాపు 12వేల మంది ఓటర్లు, 50 వేల జనాభా, 85 కాలనీలు ఉన్నాయి. ఏటా దాదాపు రూ.10కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ గ్రామంలో స్థానికంగా ఉండే వారి కన్నా బయటి ప్రాంతాల నుంచి వచ్చి నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఘట్కేసర్ మండల పరిధిలో చౌదరిగూడతో పాటు అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం, మర్పల్లిగూడ, ఎదులాబాద్, వెంకటాపూర్, కొర్రెముల, ప్రతాప సింగారం కాచివాని సింగారం, గ్రామపంచాయతీలు ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ శివారులోని బోడుప్పల్, పీర్జాదిగూడలు ఒకప్పుడు ఘట్కేసర్ మండలంలోని గ్రామపంచాయతీలు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా గుర్తించి పీర్జాదిగూడ, బోడుప్పల్ గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లుగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఘట్కేసర్ మండలంలోని ఘట్కేసర్, పోచారం గ్రామపంచాయతీలను మున్సిపల్ గా ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతం కావడంతో అనతి కాలంలో చౌదరిగుడా గ్రామం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. అయితే వచ్చే సంవత్సరం 2024 ఫిబ్రవరి చివరినాటికి గ్రామపంచాయతీల పదవీకాలం కూడా పూర్తికానుంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాలలో పంచాయతీ ఎన్నికల పై స్థానిక నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కాగా చౌదరిగుడా గ్రామపంచాయతీ ఎన్నికల విషయంలో స్థానిక నాయకుల్లో సంగ్దితత నెలకొంది.

చౌదరిగూడ గ్రామపంచాయతీని పోచారం మున్సిపాలిటీలో విలీనం చేస్తారా లేక కొర్రెముల, వెంకటాపూర్, ప్రతాప్సింగారం, కాచివానిసింగారం గ్రామాలను కలుపుతూ ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తారా అనేది చర్చ జరుగుతోంది. స్థానిక నాయకులు మాత్రం ఎన్నికల కోసం తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు స్థానిక నాయకులు ఎలాగైనా చౌదరిగూడ గ్రామపంచాయతీని తమ గ్రామాలతోనే కలిపి మున్సిపల్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరినట్లు తెలిసింది. ఏది ఏమైనా అత్యంత ఆదాయం తెచ్చిపెట్టే గ్రామపంచాయతీగా చౌదరిగుడా వైపు అందరి చూపు పడింది. గెలుపు, ఓటముల మాట పక్కన పెడితే ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న సర్పంచులు, గతంలో పోటీ చేసిన అభ్యర్థులు మరోసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు గ్రామాలలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి హడావిడి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed