నిజాంపేట్ లో చెరువుల పండగ దండగ.. కబ్జాల పండగ చేసుకోండి: బీజేపీ

by Kalyani |
నిజాంపేట్ లో చెరువుల పండగ దండగ.. కబ్జాల పండగ చేసుకోండి: బీజేపీ
X

దిశ, కుత్బుల్లాపూర్ : బీఆర్ఎస్ నాయకులు చెరువుల పండగ దండగ చెరువులలో కబ్జాల పండుగ చేసుకోండి అని నిజాంపేట్ బీజేపీ నాయకులు ఆరోపించారు. బాచుపల్లి పెద్ద చెరువు వద్ద బుధవారం బీజేపీ నాయకులు చెరువు కబ్జాల పై విలేకరుల సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పెద్ద చెరువు కట్టను తొలుస్తూ, చెరువు నాలాను కబ్జా చేస్తూ ఆకృతి నిర్మాణం సంస్థ అక్రమ నిర్మాణం చేపడుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఆకృతి నిర్మాణం సంస్థ కు అనుమతులు రావడం వెనుక బీఆర్ఎస్ నేతల పైరవీ ఉందని ఆరోపించారు. కేటీఆర్ ఎన్నోసార్లు రాష్ట్రంలోని చెరువులను సంరక్షిస్తాం అని చెప్పారు. కానీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం 22 చెరువులకు గాను 17 చెరువులు కబ్జాలతో కనుమరుగు అవుతున్నాయని వాపోయారు.

నిజాంపేట్ లో జరుగుతున్న చెరువు కబ్జాలపై కమిషనర్ నుంచి కలెక్టర్ వరకూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. ఆకృతి కన్ స్ట్రక్షన్ కంపెనీ పెద్ద చెరువు కట్ట స్థలం, తూము నాలాను ఆక్రమిస్తూ భవంతి నిర్మాణం చేపట్టడం దురదృష్టకరం అని అన్నారు. బాచుపల్లి సర్వే నంబర్ 453 పేర్కొంటూ ఆకృతి కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తున్నదని, కానీ అందులో గ్రీన్ బెల్ట్ ఏరియా, చెరువు కట్ట, తూము నాలా స్థలాలు కబ్జా చేయడం దారుణమని ఎండగట్టారు. నిజాంపేట్ లో చెరువులను కబ్జా చేస్తూ బీఆర్ఎస్ నాయకులు చెరువు పండగ చేసుకోవడం హాస్యాస్పదం అని విమర్శించారు. కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్, కాశీ, ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మేం అన్నీ అనుమతులతో నిర్మిస్తున్నాం: ఆకృతి నిర్మాణం సంస్థ నిర్వాహకులు

మేం అన్నీ అనుమతులతో నిర్మాణం చేస్తున్నాం. బీజేపీ నాయకులు మాపై బురద చల్లాలనే దురుద్దేశం తో ఆరోపణలు చేస్తున్నారు. మా స్థలం వద్దకు అక్రమంగా వచ్చి బీజేపీ నాయకులు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, నీటి పారుదల శాఖ నుంచి మా సైట్ కు ఎన్ఓసీ కూడా ఉంది. ఇలా తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం.

Advertisement

Next Story