Villagers protest : అంకుషాపూర్ లో స్వచ్చదనం - పచ్చదనం బై కాట్..

by Sumithra |
Villagers protest : అంకుషాపూర్ లో స్వచ్చదనం - పచ్చదనం బై కాట్..
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో స్వచ్ఛ దనం - పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామస్తులు బై కాట్ చేశారు. సోమవారం డీఆర్డీఓ సాంబశివరావు, డీపీఓ వెంకన్న, డిఎల్పీఓ సాంబిరెడ్డి, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీఓ రవి, ఎమ్మార్వో డీఎస్ రజిని అకుషాపురంలో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలుపుతున్నట్లుగా వస్తున్న వార్తల పై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ అధికారులను ఘెరావ్ చేసి నిరసన తెలియజేశారు. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అధికారులు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరగనివ్వాలని.. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి వినతిపత్రం అందించుకోవాలని డీఆర్డీఓ సాంబశివరావు, డీపీఓ వెంకన్న ప్రజలను కోరారు. అధికారుల అభ్యర్థన మేరకు మాజీ ఎంపీపీ వైయస్సార్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అధికారుల బృందం మొక్కలు నాటేందుకు వెళుతుండగా ప్రజలు అడ్డుకున్నారు. గ్రామాల విలీనం పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed