- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కనుమరుగవుతున్న కాముని చెరువు
దిశ, కూకట్పల్లి : అనగనగా ఒక ఊరు... ఆ ఊర్లో వంద ఎకరాలలో చెరువుండేది... దాహార్తిని తీర్చేందుకు, వ్యవసాయానికి ఆ నీటిని వినియోగించే వాళ్లం... అంటూ భవిష్యత్తులో భావి తరాలకు మన చుట్టే కనుమరుగవుతున్న చెరువుల గురించి కథలుగా చెప్పుకునే పరిస్థి వచ్చేలా ఉంది. వందల ఎకరాల విస్తీర్ణంలో సాగునీరు, తాగునీరు అందించి జల కళ ఉట్టిపడిన చెరువులు కాస్తా చిన్న కుంటలుగా, ఇంటి ముందు తవ్వుకునే సంపు గుంతలుగా మిగిలి పోతున్నాయంటే ఏ విధంగా చెరువులను చెరబడుతున్నారో అర్థం అవుతుంది.
అందుకే భావి తరాలకు నీటి సంపద అనేది కనిపించకుండా పోయే ప్రమాదం లేక పోలేదు అని మేధావులు ఇప్పటికే చెబుతున్నారు. కూకట్పల్లి, బాలానగర్ మండలాల పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట్, అల్లాపూర్, బాగ్అమీర్, హైదర్‌నగర్, హస్మత్‌పేట్ గ్రామాల్లో మొత్తం 14 చెరువులు దశాబ్దాలుగా ప్రజల దాహార్తిని తీర్చాయి. అవి కాల క్రమేణా రియల్ మాఫీయా, భూ మాఫీయా కబంద హస్తాలలో కుంచించుకు పోయి కనుమరుగు అవుతున్నాయి.
వాటిలో ఒకటే కూకట్పల్లి, మూసాపేట్ గ్రామాల మధ్యలో 101.28 ఎకరాల విస్తీర్ణంలో ఉంటూ మూడు గ్రామాల ప్రజలకు దాహార్తిని తీర్చిన కాముని చెరువు. కాముని చెరువుపై కన్ను పడ్డా భూ బకాసురులు అన్ని దిక్కుల నుంచి కబ్జా చేస్తూ వస్తున్నారు. 101.28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం చిన్న కుంటగా మిగిలి పోయింది. రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు ఎన్ని కేసులు పెట్టినా భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు కదా మరింత రెచ్చిపోయి కబ్జాలు చేస్తున్నారు. నగరంలో చెరువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ, కమిషనర్ రంగనాథ్ కనికరించి కబ్జా బారి నుంచి కాముని చెరువును కాపాడాలని పలువురు వేడుకుంటున్నారు.
రెండు గ్రామాల మధ్య కాముని చెరువు
కూకట్పల్లి మండల పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట్ రెండు గ్రామల మధ్య కాముని చెరువు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ పరిధి కూకట్పల్లి గ్రామ సర్వే నంబర్లు 989, 990, 993, 933/పి, 934, 994, 992/పి, మూసాపేట్ గ్రామ సర్వే నంబర్లు 80,49, 78. బఫర్ జోన్ పరిధి కూకట్పల్లి గ్రామ సర్వే నంబర్లు 989, 992/పి, 934, 988, 991, 987, 992, 931, 933, 935, మూసాపేట్ గ్రామ సర్వే నంబర్లు 48, 50, 78, 49, 79, 81లలో ఉంది. ఇదిలా ఉండగా ఇందులో 934, 935, 990, 993 సర్వే నంబర్లు హౌసింగ్ బోర్డు విభాగానికి సంబంధించినవి కాగా సర్వే నంబర్ 933 డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినవి.
మొత్తం కాముని చెరువు ఎఫ్టీఎల్ ఏరియా 101.28 ఎకరాలు కాగా అందులో ఇప్పటికే రాఘవేంద్ర సొసైటీ పేరుతో సుమారు పది ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు రెవెన్యు అధికారులు తెలిపారు. అదే విధంగా సైబర్‌సిటి నిర్మాణ సంస్థ సైతం ఎఫ్టీఎల్ పరిధిలోని కొంత భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సఫ్దర్‌నగర్ వైపు నుంచి చెరువు కట్ట పొడవున, చెరువుకు మరో వైపు ప్రైవేటు సర్వే నంబర్ల పేరుతో కొంత మంది చెరువును మట్టితో నింపుతున్నారు. 101.28 ఎకరాల అతి పెద్ద చెరువు కాస్తా 40 ఎకరాల వరకు చేరుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్ని కేసులు నమోదు చేసినా తీరు మారడం లేదు
కాముని చెరువు కబ్జాలను అరికట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదు చేసినా భూ కబ్జాలకు పాల్పడుతున్న వారి తీరులో మార్పు రావడం లేదు. రాఘవేంద్ర సొసైటి వైపు నుంచి కొంత మంది ఎఫ్టీఎల్ నిర్ధారించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి రెండు ఎకరాల వరకు మట్టి నింపడంతో 2022 నవంబర్ నెలలో రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో నవంబర్ 12, 2022న క్రైం నంబర్ 854/2022లో ఐపిసి 427, సెక్షన్ 3 ఆఫ్ పిడిపిపిఏ, 35 ఆఫ్ టిఎస్వాల్టా యాక్ట్ చట్టం ప్రకారం కబ్జాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. బేయిల్‌పై తిరిగి వచ్చిన సదరు వ్యక్తులు మళ్లీ తమ కబ్జా భాగోతాన్ని కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా 2020 లోనూ రఘవేంద్ర సొసైటీలో కాముని చెరువు కబ్జా చేసి గదులు నిర్మిస్తుండగా వాటిని కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేసినందుకు కూకట్పల్లి తహసీల్దార్ గోవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నంబర్ 943/2020, ఐపీసీ 353,332,447 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చెరువు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం : లక్ష్మీనారాయణ, ఏఈ, నార్త్ ట్యాంక్ డివిజన్, ఇరిగేషన్ విభాగం
కాముని చెరువును మట్టితో నింపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెరువు చుట్టూ పైప్‌లైన్ పనులు చేపట్టి డ్రైనేజీ నీళ్లు చెరువులో కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. చెరువు కబ్జాకు పాల్పడుతున్న వారు ఎవరైనా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.
- Tags
- Kamuni Pond