రాష్ట్రపతి నిలయంలో ఉద్వాన్ ఉత్సవ్

by Sridhar Babu |
రాష్ట్రపతి నిలయంలో ఉద్వాన్ ఉత్సవ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్రపతి భవన్ సందర్శకులను మరింత అలరించనుంది. దేశ వారసత్వ సంపదకి చిహ్నంలా నిలిచే అపురూపమైన కట్టడాలు, కంటికి ఇంపు గొలిపే అందమైన పచ్చిక బయళ్లు, రాతి శిలలపై చెక్కిన చిత్రాలు, మహనీయుల జీవిత విశేషాలు చెప్పే ఆర్ట్ గ్యాలరీ ఇలా ఎన్నెన్నో విశేషాలకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వేదికగా నిలుస్తోంది.

ఏటా రాష్ట్రపతి ఢిల్లీలోనే కాకుండా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొద్ది రోజుల పాటు బస చేయటం అనావాయితీ. ఇందులో భాగంగానే మంగళవారం (ఈ నెల 17న) సాయంత్రం శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఈ నెల 21 వరకు ఇక్కడే బస చేయనున్నారు. రాష్ట్రపతి విడిది అనంతరం ఎన్నో విశిష్టతలు ఉన్న ఆ నిలయాన్ని సాధారణ పౌరులకి చూసే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఈసారి మాత్రం ‘ఉద్వాన్ ఉత్సవ్’అనే కార్యక్రమంతో సందర్శకులను కనువిందు చేయనున్నారు.

పిక్నిక్ స్పాట్ లా..

అగ్రికల్చర్ అథారిటీ ఇనిస్టిట్యూట్, సాంస్కృతిక, టూరిజం శాఖల సమన్వయంతో ‘ఉద్వాన్​ ఉత్సవ్’ అనే పేరుతో రాష్ట్రపతి నిలయాన్ని ఒక పిక్నిక్ స్పాట్ గా తయారు చేయబోతున్నారు. సువిశాలమైన భవనంలో ఆహ్లాదకర వాతావరణంలో పచ్చిక బయళ్ల మధ్య స్టాల్స్, చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక భౌగోళక వ్యవసాయం, సమీకరణ వ్యవసాయం పై అవగాహన కల్పించేలా కుటీరాలను, స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్దేశిత ప్రాంతాలలో నిర్దేశిత పంటలు, వ్యర్థాలతో ఉపయోగాల తయారీ గురించి ప్రజలకు, విద్యార్థులకు తెలిసేలా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. తమ ఇళ్లలో నర్సరీ, గార్డెనింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలిపేలా మెళకువలతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్ లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా రేడీ చేస్తున్నారు. ఇంతే కాకుండా చిరుతిండ్ల స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

తీపి గుర్తులా మిగిలేలా...

ఉద్వాన్​ ఉత్సవ్ ను తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించి, ఒక తీపి గుర్తుగా ఉండిపోయేలా వారి జ్ఞాపకాలలో నిలపాలని అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉద్వాన్ ఉత్సవ్ ను సక్సెస్ చేసేందుకు, సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని యోచిస్తున్నారు. ఎంత మంది సందర్శకులు వచ్చినా వారికి ఎలాంటి లోటు రాకుండా తాగునీరు, అంబులెన్స్, మోబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌలిక వసతులను సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఉద్వాన్ ఉత్సవ్ పై సమీక్ష

ఉద్వాన్ ఉత్సవ్ నిర్వహణ, ఏర్పాట్లపై బుధవారం మేడ్చల్ కలెక్టరేట్ లో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్యామ్యుల్ ప్రవీణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్యామ్యుల్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరంలాగానే శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి తిరిగి వెళ్లిన అనంతరం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శంచడానికి ప్రజలకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈసారి మాత్రం ఒక ప్రధాన ఉద్దేశంతో ‘ఉద్వాన్ ఉత్సవ్’ అనే కార్యక్రమంతో సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్వాన్ ఉత్సవ్ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ అగ్రికల్చర్ సరవనన్ రాజ్, జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్ రెడ్డి, సోషల్ వెల్పేర్ అధికారి వినోద్ కుమార్, డీఈఓ విజయ కుమారి, హర్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed