అధికారుల్లో ‘హైడ్రా’వణుకు

by Sridhar Babu |
అధికారుల్లో ‘హైడ్రా’వణుకు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అధికారుల్లో హైడ్రా వణుకు మొదలైంది. అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన అధికార యంత్రాంగానికి కునుకు కరువైంది. చెరువు శిఖం పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగానికి హైడ్రా సిఫారసు చేయడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లాలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్ లపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించడం హాట్ టాఫిక్ గా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్కుల కొమ్ము కాసిన అధికారులపై వేటుకు రంగం సిద్దమవ్వడంతో ఇలాంటి తప్పులు చేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఉల్లంఘనలు ఇలా..కేసులు అలా..

బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మించిన మూడు భారీ భవనాలను హైడ్రా ఇటీవల నేలమట్టం చేసిన విషయం విధితమే. చెరువు శిఖంలో భవనాలు నిర్మిస్తున్నారని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామక్రిష్ణ, బాచుపల్లి తాహసీల్దార్ పుల్ సింగ్, సర్వేయర్ తో సహా మేడ్చల్ జిల్లా సర్వే ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లపై అభియోగాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఆ అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఆ భవనాలపై ఆధారాలతో సహా సమర్పించినా పక్కన పెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చినట్లు సమాచారం.

అయితే మేడ్చల్ జిల్లాలో 70 శాతం చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమణల సమయంలో అక్కడ విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను హైడ్రా సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల పాత్రపై అధికారులు అరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చెరువుల పరీవాహక ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలపై అనుసరించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమార్కులకు వత్తాసు..

మేడ్చల్ జిల్లాలో 620 చెరువులుండగా, వీటిలో 100కు పైగా చెరువులు పూర్తిగా మాయమయ్యాయి. 400లకు పైగా చెరువులు సగానికి పైగా కబ్జాకు గురయ్యాయి. అసలు జిల్లాలో కబ్జాకు గురికాని చెరువు లేదంటే అతిశయోక్తి కాదు. పలు చోట్ల చాలా మంది చెరువులను ఆక్రమించుకొని భారీ నిర్మాణాలను చేపట్టారు. పెద్ద ఎత్తున ఇలాంటి నిర్మాణాలు చేపట్టినా.. చేపడుతున్నా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించారు. పర్యవేక్షణ అధకారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా..? లేదా ? చూడాల్సిన బాధ్యత ఉంది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అక్రమార్కులకు వత్తాసు పలికినట్లు హైడ్రా వద్ద ఆధారాలు ఉన్నట్లు సమాచారం.

ఉదాహరణకు మల్లంపేటలో చెరువును ఆక్రమించి నిబంధనలకు విరుద్దంగా లక్ష్మీ శ్రీనివాస్ అనే నిర్మాణ సంస్థ వందల సంఖ్యలో విల్లాలను నిర్మించింది. వీటికి ముగ్గురు కమిషనర్లు సహకరించారని వారిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్ హరీష్ ప్రభుత్వానికి సిఫారసు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో చాలా ఆక్రమణలు జరిగాయి. నిజాంపేట, బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేట, కుత్బుల్లాపూర్, పేట్ బషీర్ బాద్, మేడ్చల్, జవహర్ నగర్, తూంకుంట, కీసర, దమ్మాయిగూడ, గోధుమ కుంట, చీర్యాల, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించలేదని, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మామూళ్ల మత్తులో జోగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలకు సహకరించిన అధికారుల డేటాను సేకరించి, వారిపై చట్టపరమైన చర్యలకు సైతం హైడ్రా ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్రమణలకు సహకరించిన మేడ్చల్ జిల్లా అధికారుల్లో వణుకు మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed