Microsoft: మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్ .. 1 శాతం మందికి గుడ్‌బై

by S Gopi |
Microsoft: మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్ .. 1 శాతం మందికి గుడ్‌బై
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త ఏడాది ప్రారంభమై పది రోజులు ముగియకముందే మరోసారి లేఆఫ్స్ మొదలయ్యాయి. గత మూడేళ్లుగా వివిధ కారణాలతో ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పుడు మరో కారణంతో ప్రక్రియను మొదలుపెట్టాయి. ఈసారి గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీన్ని ప్రారంభించింది. కంపెనీలోని వివిధ స్థాయిలలో ఉన్న ఉద్యోగులను పనితీరు ఆధారంగా తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి మీడియాతో చెప్పారు. తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగులను తీసేస్తామని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, ఎదిగాలనే ఉత్సాహం ఉన్నవారిని కొనసాగిస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కంటే తక్కువ మందిపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. సరైన పనితీరు లేని వారిని మాత్రమే తొలగించనున్నందున ఆ స్థానాలను కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ గతేడాదిలోనూ 10,000 మందిని తొలగించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం. అంతేకాకుండా కంపెనీకే చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లోనూ ఏకంగా 2,000 మందికి లేఆఫ్ నోటీసులిచ్చింది. వేగంగా మారుతున్న టెక్ రంగంలో ఆర్థిక ఒత్తిడి పెరిగింది. దీనివల్లే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను 2025లోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story