హస్తం అస్తవ్యస్తం .. ఉప్పల్‌లో కాంగ్రెస్ కంచు కోటకు బీటలు

by Aamani |   ( Updated:2023-11-15 14:50:33.0  )
హస్తం అస్తవ్యస్తం .. ఉప్పల్‌లో కాంగ్రెస్ కంచు కోటకు బీటలు
X

దిశ,నాచారం : హస్తం కంచుకోటకు బీటలు వారుతుందా...? ఉప్పల్ లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా...? దశాబ్ద కల నెరవేరడం కష్టమేనా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. కాంగ్రెస్ అడ్డాగా ఉప్పల్ గడ్డ పేరుగాంచింది.కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కీలక నేతలు పార్టీకి దూరమవ్వడం... అభ్యర్థి ప్రచారంలో దూకుడు కనబర్చకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కలగానే మిగిలిపోనుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

హస్తం కు బీటలు..

మేడ్చల్ నియోజకవర్గం పునర్విభజన లో భాగంగా 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. కానీ క్రమ క్రమంగా.. కాంగ్రెస్ పూర్వ వైభవం కోల్పోతుంది. ఉప్పల్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ కు.. బీటలు వారుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీని వీడుతున్న నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేక పోతుంది. వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదని.. నాయకులు వాపోతున్నారు. నాయకత్వం సంప్రదించి భరోసా కల్పిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. నాయకులు తమ మనసులో మాట విప్పారు. పార్టీని విడాలంటే కష్టంగా ఉందని.. అయినప్పటికిని పార్టీని వీడడం తప్పడం లేదని.. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని.. పార్టీ కోసం కష్టపడ్డ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేయడం తో పాటు వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని వదులుకొని సొంత డబ్బులతో పార్టీకి సేవ చేసిన పార్టీలో గుర్తింపు లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులను పక్కన పెట్టారని.. సీనియర్ నాయకులు వాపోతున్నారు.

రాష్ట్రమంతా అనుకూలం.. కానీ..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. కర్ణాటక ఫలితాలు... కాంగ్రెస్ జోరును పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీ గా కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. టీ ఆర్ ఎస్, బీజేపీ లకు చెందిన నాయకులు ముకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉప్పల్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మందముల పరమేశ్వర్ రెడ్డి జూనియర్ కి కేటాయించారని పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో ఉన్న నాయకులకు టికెట్లు ఎలా కేటాయిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఉప్పల్ టికెట్ అమ్ముకున్నాడని రేవంత్ రెడ్డి పై బహిరంగంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పై దుమ్మెత్తి పోసిన సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి తదితర నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీకి చెందిన నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు....

కాంగ్రెస్ లో అసంతృప్తి రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. అసంతృప్తి నాయకులు కాంగ్రెస్ కు రాజీనామాలు చేస్తున్నారు. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తమ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ముఖ్య నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉప్పల్ కు చెందిన పి సీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి తో పాటు వందల సంఖ్యలో నాయకులు బీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మల్లాపూర్ కాంటెస్ట్ కార్పొరేటర్ సంజీవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ముసలి శ్రీనివాస్ రెడ్డి, రామంతాపూర్ కు చెందిన సీనియర్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్, కాప్రా సర్కిల్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్ లోకి ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అలకబూనిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది.

ఉప్పల్ లో ఫుల్ .. కాప్రా లో నిల్..

కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే మందముల పరమేశ్వర్ రెడ్డి టికెట్ కేటాయించారు. పరమేశ్వర్ రెడ్డి గతంలో రామంతపూర్ కార్పొరేటర్ గా పని చేశారు. అలాగే ఏ బ్లాక్ అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్, చిలకనగర్, హబ్సిగూడ, రామంతపూర్ పరిధిలో పరమేశ్వర్ రెడ్డి కి మంచి పట్టు ఉంది. కానీ కాప్రా సర్కిల్ బీ - బ్లాక్ అద్యక్షులుగా సోమశేఖర్ రెడ్డి కొనసాగారు. ఇటీవల పరిణామాలు నేపథ్యంలో సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు. దీంతో కాప్రా సర్కిల్ పూర్తిగా కాంగ్రెస్ వాష్ అవుట్ అయింది. ఎమ్మెల్యే అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి కి మాత్రం కాప్రా సర్కిల్ లో నామమాత్రపు పట్టు ఉంది. ఉప్పల్ సర్కిల్ లో ఓటర్లను ప్రభావితం చేసే పరమేశ్వర్ రెడ్డి.. కాప్రా సర్కిల్ లో మాత్రం అంతగా ప్రభావితం చేయలేకపోతున్నారు. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కాప్రా లోని సైనిక్ పూర్ లో నివాసం ఉండటం వల్ల ఆయనకు పూర్తిగా కాప్రా సర్కిల్, అలాగే ఉప్పల్ సర్కిల్ పైన పూర్తి పట్టు ఉంది. ఉప్పల్ సర్కిల్ లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హబ్సిగూడ లో ఉండటం.. ఉప్పల్ సర్కిల్లో బీఆర్ఎస్ కు.. బలమైన ఓటు బ్యాంకు ఉంది.

కాంగ్రెస్ మాత్రం కేవలం.. ఉప్పల్ సర్కిల్ కు పరిమితమై ఉంది. అలాగే రాష్ట్ర నాయకులు పసు వుల ప్రభాకర్ రెడ్డి, కాప్రా సర్కిల్ కు చెందిన డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేసి బీ ఆర్ ఎస్ లో చేయడంతో కాంగ్రెస్ పార్టీ.. ఐసోలేషన్లో చేరినంత పని అయింది. అలాగే పార్టీ అభ్యర్థి కూడా నామమాత్రం ప్రచారం కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత విస్తృతం పరిచి నాయకులను కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చి .. ప్రచారం చేపడితే తప్ప.. కాంగ్రెస్ పార్టీ బయటపడవచ్చని.. లేదంటే బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు నల్లేరు నడికేనని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార బీ ఆర్ ఎస్ మాత్రం నియోజకవర్గంలో ఉప్పల్, కాప్రా సర్కిల్లో బలంగా ఉంది. కాంగ్రెస్ మాత్రం.. కాప్రా లో బలహీనంగా ఉండటం ఏ మేరకు.. ఓట్లు సాధిస్తుందో..? వేచి చూడాలి మరి. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉప్పల్ లో పాగా.. వేస్తుందో..? కారుతో ఢీకొనలేక పల్టీ కొడుతుందో.. వేచి చూడాలి మరి...

Advertisement

Next Story

Most Viewed