వివాదాస్పదంగా మారిన భూదాన్ భూముల వ్యవహారం

by Aamani |
వివాదాస్పదంగా మారిన భూదాన్ భూముల వ్యవహారం
X

దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దాదాపు 33 ఎకరాల భూదాన్ భూమి రియల్టర్ల పాలైందని నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఇటీవల ఘట్కేసర్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో భూదాన్ భూముల బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో బంజారా నాయకుడు రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడని ఘట్కేసర్ పీఎస్ లో కేసు నమోదైంది.

పరాధీనంలో భూదాన్ భూములు...!

ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధి ఘనాపూర్లో సర్వేనెంబర్ 1077,1078,1082,1083 1084,1087,1088లలో 33 ఎకరాల భూదాన్ భూమి ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఓఆర్ ఆర్ పక్కనే ఉన్న భూములకు ఎకరాకు రూ.కోట్లల్లో పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే భూదాన్ భూములు కూడా ఓ ఆర్ ఆర్ పక్కనే ఉండడంతో భూదాన్ భూములు పొందిన వ్యక్తులు దాదాపు 14 మంది ఈ భూములను జగత్ స్వప్న రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్ముకున్నారని, ఈ విషయంలో అధికారులు కూడా సహకరించినట్లుగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ భూదాన్ భూములను బడా నాయకులు కొందరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై భూదాన్ భూములను పొందిన వారి నుంచి కొనుగోలు చేసి తమ ఆధీనంలో పెట్టుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే భూదాన్ భూములు రియల్టర్ల పాలు కాకపోతే ఎక్కడ ఉన్నాయో చూపించాలని అడిగినందుకు రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని నంగారా బేరి నాయకుడు గణేష్ నాయక్ తెలిపారు.

ప్రశ్నిస్తే బెదిరింపులా...

భూదాన్ భూముల విషయంలో తహసీల్దార్ కార్యాలయానికి రావద్దు... వచ్చి తనను వేధించినా, విసిగించినా, ప్రశ్నించినా సూసైడ్ చేసుకుంటానని తహసీల్దార్ బెదిరించిందని గణేష్ నాయక్ తెలిపారు. కానీ భూదాన్ భూముల వ్యవహారంలో కావాలని రాద్ధాంతం చేస్తూ రెవెన్యూ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రస్తుతం భూదాన్ భూములలో గడ్డి సాగు, మామిడి తోట ఉండగా కొన్నిచోట్ల పడావు గా ఉన్నాయి... సుమారు 1988 సంవత్సరంలో భూదాన్ భూములలో పవర్ గ్రేట్ కార్పొరేషన్ (ఎన్టిపిసి) వెలిసిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా వ్యవసాయం చేయకుండా పడావుగా వదిలేసిన భూదాన్ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటారా... ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

గణేష్ పై ఘట్కేసర్ పీఎస్ లో కేసు : ఘట్కేసర్ తహసీల్దార్,డీఎస్.రజిని

భూదాన్ భూముల విషయంలో నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు గణేష్ రెవెన్యూ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు భూమిని పరిశీలించారు. సంబంధించిన రిపోర్టులు జిల్లా ఉన్నతాధికారులకు పంపించాము. తహసీల్దార్ కార్యాలయంలో క్రమశిక్షణా రహితంగా అధికారుల విధులకు ఆటంకాలు కలిగిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న గణేష్ నాయక్ పై కేసు ఘట్కేసర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం .

భూదాన్ భూముల్లో వెంచర్ చేయలేదు : జగత్ స్వప్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్

భూదాన్ భూములకు మాకు ఎలాంటి సంబంధం లేదని జగత్ స్వప్న ఇన్ప్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ వంశీకృష్ణ చెప్పారు. తమ వెంచర్ లో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. సంస్థకు చెడ్డ పేరు వచ్చేలా ఎవరైనా వ్యవహరిస్తే పరువు నష్టం దావా వేస్తామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Advertisement

Next Story