తిలక్‌ను నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో.. వంశ తిలక్ తీరుతో రగిలిపోతున్న సీనియర్‌లు

by Disha Web Desk 23 |
తిలక్‌ను నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో.. వంశ తిలక్ తీరుతో రగిలిపోతున్న సీనియర్‌లు
X

దిశ,తెలంగాణ బ్యూరో : కంటోన్మెంట్ లో బీజేపీ పటిష్టత కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.కొందరు పార్టీ కోసం త్యాగాలకు సిద్ధపడ్డ వారు ఉన్నారు. వాళ్లని కాదని నియోజకవర్గ ప్రజలతో ఏ మాత్రం పరిచయం లేని వంశ తిలక్ కు పార్టీ టికెట్ కట్టబెట్టింది.అలాంటప్పుడు పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుని, ఉప ఎన్నికల్లో విజయబావుట ఎగుర వేయాల్సిన బాధ్యత వంశ తిలక్ ది. అసంతృప్తులు ఎవరైనా ఉంటే నువ్వు పార్టీ కోసం బాగానే కష్టపడ్డావు. కానీ టికెట్ ను నేను సంపాదించాను. దానికి ఏవేవో కారణాలున్నాయి. కాబట్టి మీరు ఏమి అనుకోవద్దు. పార్టీ కోసం పనిచేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం.. అని చెప్పాల్సిన బాధ్యత వంశ తిలక్ పైనే ఉంటుంది. కానీ వంశ తిలక్ వీటన్నింటికి అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఒంటెద్దు పోకడలతో తనకు నచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ల గుస్సా..

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని బీజేపీ శ్రేణులు రాత్రి పగలు కష్టపడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాషాయ పార్టీని 2023 ఎన్నికల్లో రెండో స్థానానికి తీసుకువచ్చారు. ఊహించిన విధంగా వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిలో కొందరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూ. లక్షలు జేబు నుంచి ఖర్చు చేశారు. ఇలా నియోజకవర్గంగా ఇప్పటికే రెండు నుంచి మూడు కోట్ల రూపాయాల వరకు ఖర్చు చేసినట్లు పలువురు నేతలు చెబుతున్నారు. అయితే వంశ తిలక్ కు టికెట్ ఇవ్వడం ‘వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’ అయ్యింది.తన జేబులోంచి రూ. లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తుంటే వంశ తిలక్ మాత్రం కొత్త పెళ్లి కోడుకులా..తనపై జులం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.

మీరంతా ఎన్నికల్లో పనిచేసేది తన కోసం కాదని, ధర్మం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఆర్థికంగా నష్టపోవడానికి కూడా సిద్ధం కావాలని వంశ తిలక్ సమర్దించుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు కొందరు నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ తిలక్ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు వాపోతున్నారు.గత 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలో ఉన్న శ్రీ గణేష్ ను పార్టీలోకి తీసుకుని స్థానిక నాయకత్వానికి ఇష్టం లేకున్నా.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బలవంతంగా మాపై పార్టీ రుద్దినట్లే..ఈసారి ఎక్కడో ఉన్న వంశ తిలక్ కు టికెట్ ఇచ్చి మరోసారి బలప్రయోగం చేయడంపై కాషాయ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed