గులాబీ దండుకు.. పదవుల గండం!.. మున్సిపాలిటీల్లో తెర మీదకు అవిశ్వాస తీర్మాణాలు

by Shiva |   ( Updated:2024-01-06 03:35:00.0  )
గులాబీ దండుకు.. పదవుల గండం!.. మున్సిపాలిటీల్లో తెర మీదకు అవిశ్వాస తీర్మాణాలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను అవిశ్వాస తీర్మాణాల గండం వెంటాడుతోంది. మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, నగర పాలికల్లో ‘అవిశ్వాస’ రాజకీయాలు జోరందుకున్నాయి. మున్సిపల్ పాలకవర్గాలు ఏర్పడి నాలుగేళ్లు కావస్తుండటంతో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల వ్యతిరేక వర్గాలు అవిశ్వాస తీర్మానాలకు తెరలేపుతున్నాయి. ఇటీవల కొత్త సర్కారు రాష్ట్రంలో కొలువు దీరడంతో గులాబీ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల వలసలు కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అండతో పలువురు అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ మేయర్లు, చైర్మన్లను గద్దె దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జవహర్ నగర్ మేయర్‌తో పాటు, దమ్మాయిగూడ, మేడ్చల్, ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అసంతృప్తి.. అవిశ్వాసం

నాలుగేళ్ల క్రితం మేడ్చల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లతో సహా, 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. కానీ, చాలా చోట్ల ఏడాది, రెండేండ్ల నుంచే సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకుంది. మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. నిధుల కేటాయింపుల్లో పక్షపాతం, ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసంతృప్తితో రగిలిపోయారు. గతేడాది జవహర్ నగర్ మేయర్‌తో పాటు మేడ్చల్, దమ్మాయిగూడ, మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాస నోటీసులిచ్చి తమ ఆగ్రహాన్ని బయటపెట్టారు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీకి నష్టం కలుగకుండా బీఆర్ఎస్ హై‌కమాండ్ అవిశ్వాసాలకు తాత్కాలిక బ్రేకులు వేసింది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలో ఉంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అండతో బీఆర్ఎస్ మేయర్, చైర్ పర్సన్లను దింపాలని చూస్తున్నారు.

క్యాంపు రాజకీయాలకు తెర..

జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై గతంలో అవిశ్వాస నోటీసు ఇచ్చిన మేజారిటీ బీఆర్ఎస్ అంసతృప్త కార్పొరేటర్లు బాపట్లలో క్యాంపు రాజకీయాలు నడిపారు. 18వ డివిజన్ కార్పొరేటర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ నాయకత్వంలో 20 మంది కార్పొరేటర్ల సంతకంతో జిల్లా కలెక్టరేట్‌లో అవిశ్వాస నోటీసును అందజేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లు క్యాంపునకు తరలివెళ్లారు. అయితే, నాటి మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జోక్యంతో వెనక్కి తగ్గారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొల్పోవడం.. ఎన్నికలకు ముందు హస్తం గూటికి చేరిన 28వ డివిజన్ కార్పొరేటర్ నిహారిక గౌడ్ మేయర్ పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో మేయర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టిన కార్పొరేటర్లతో తన తండ్రి, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అప్పటికే మేయర్ తీరుతో విసిగిపోయిన పలువురు కార్పొరేటర్లు నిహారిక గౌడ్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో ఉంటేనే స్థానికంగా పనులు చక్క బెట్టుకునే వీలుంటుందని, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఉన్నా.. ఫలితం లేదన్న భావనతో పలువురు కార్పొరేటర్లు నిహారిక గౌడ్‌కు జై కొడుతున్నట్లు సమాచారం. మరోసారి మేయర్‌పై అవిశ్వాస నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళ చైర్‌పర్సన్లపై కూడా..

మేడ్చల్, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్‌లలోని మహిళ మున్సిపల్ చైర్ పర్సన్లను గద్దె దించేందుకు అసంతృప్త కార్పొరేటర్లు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు మర్రి దీపికా రెడ్డి, ప్రణీత గౌడ్‌లపై గతేడాది అసంతప్త కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. అయితే నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు అధికార యంత్రాంగం అవిశ్వాస తీర్మానాలను ప్రవేశ పెట్టకుండా కాలయాపన చేసింది. తాజాగా మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు అసంతృప్త కార్పొరేటర్లు రేడి అవుతున్నట్లు సమాచారం. వీరికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఘట్ కేసర్ మున్సిపాలిటీలోని ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వీరంతా మరికొంత మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావనిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లు, అసంతృప్త కౌన్సిలర్లంతా అవిశ్వాస నోటీసులు ఇచ్చి క్యాంపు రాజకీయాలకు తరలి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్లపై మరోసారి ’అవిశ్వాస‘ ఉచ్చు బిగుస్తుండడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Advertisement

Next Story