సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ డీఎస్ చౌహాన్

by Kalyani |
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ డీఎస్ చౌహాన్
X

దిశ, ఉప్పల్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ అధికారులకు సూచించారు. రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైం, క్రైం విభాగ అధికారుల సిబ్బందితో కమిషనర్ డీఎస్ చౌహాన్ నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక కాలంలో అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వల్ల సైబర్ నేరాల శాతం పెరుగుతోందన్నారు. అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని, కానీ అదే సమయంలో ప్రజలు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన కోసం యువత భాగస్వామ్యంతో కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

నకిలీ లాటరీలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం, నకిలీ గిఫ్టు బాక్సుల వంటి పేరుతో ప్రజలను మోసం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకూడదని అధికారులకు సూచించారు. పోలీసుల కృషి, కఠిన చర్యల వల్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్ల బెడద చాలా వరకు తగ్గిందని, మహిళలు ప్రశాంతంగా బయటకు వెళ్లి తమ పనులు చేసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా అధికారులు సిబ్బంది కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం డీసీపీ అనురాధ, క్రైం డీసీపీ మధుకర్ స్వామి, సైబర్ క్రైం ఏసీపీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed