రేవంత్​రెడ్డికి కోర్టు అంటే నమ్మకం లేదా : ఎంపీ ఈటెల రాజేందర్​

by Sumithra |
రేవంత్​రెడ్డికి కోర్టు అంటే నమ్మకం లేదా : ఎంపీ ఈటెల రాజేందర్​
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నల్ల చెరువులో హైడ్రా అధికారులు కూల్చిన ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్​ మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కి కోర్టులు అంటే నమ్మకం లేదు అని ఆరోపించారు. శని, ఆదివారాలు అయితే చాలు హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడుతున్నారు. శని, ఆదివారాలు కోర్టులు సెలవులు ఉంటాయి, పేద వారు కోర్టుకు వెళ్లలేరని ఇటువంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. పేదల ఇండ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం ప్రజల నుంచి తప్పించుకోలేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదలు, సామాన్యులు, డబ్బులేని వారి ఇండ్లను కూలగొడుతున్నారని, పేదలు కోర్టు మెట్లు ఎక్కలేరని కావచ్చు అని అన్నారు. యుద్దానికి వచ్చిన ఇతర దేశం వారిపైన దయ చూపిస్తారు.

పేద ప్రజల పై కనీసం కనికరం లేకుండా శత్రువు వ్యవహరించినట్టు రేవంత్​ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. అధికారంలో ఉన్నాము, పోలీసులు ఉన్నారని తాతా జాగీర్​లా ఏది పడితే అది చేస్తే చెల్లదని హెచ్చరించారు. విర్రవీగిన చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారని గుర్తు చేశారు. ప్రజలు తలచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకు పోతారని అన్నారు. నష్టపోయిన వారికి అంచనాలు వేసి వారి బ్రతుకులను నిలబెట్టే ప్రయత్నం చేయాలని డిమాండ్​ చేశారు. ఒకప్పుడు కూకట్​పల్లిలోని నల్లచెరువు ఎన్నో ఎకరాల పంటకు సాగునీరును అందించిందని, అప్పటి రికార్డ్స్ ప్రకారం 19 ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. మధ్యలో సర్వే చేసి 27 ఎకరాలు అని తేల్చి రికార్డుల్లో ఎక్కించారని గుర్తు చేశారు. నల్ల చెరువులో కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందని, మిగిలినవన్నీ బాజాప్తా పట్టా భూములని అన్నారు. అప్పట్లో చెరువులో నీళ్లు తగ్గి భూమి తేలినప్పుడు వ్యవసాయం చేసుకునే వారని, పన్నులు కట్టలేక భూములు వదిలేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఒకనాడు కూకట్​పల్లిలో వెయ్యి రూపాయలకు ఎకరం అమ్ముకున్నవారు ఉన్నారని అన్నారు. అభివృద్ధి చెందిన తర్వాత భూముల విలువ అమాంతం పెరిగిందని అన్నారు. నల్లచెరువు నింపడానికి పై నుండి ఎలాంటి వాగులు లేవు, చుట్టు పక్కల పడ్డ వర్షంతోనే చెరువు నిండుతుందని అన్నారు. గతంలో ఈ చెరువు మత్తడిలోనే ప్రభుత్వం కమ్యూనిటీ హాలు కట్టి నిభందనలు ఉల్లంఘించిందని అన్నారు. ఈ భూములను యజమానులు కొంత మంది లీజుకు ఇచ్చుకున్నారని, గ్రామాల్లో ఉపాధిలేని యువత నగరానికి వచ్చి బతికేందుకు లీజుకు తీసుకుని తమ వ్యాపారం చేసుకుంటూ ఉంటే వారిని రోడ్డు పాలు చేశారని అన్నారు. బాధితులు తమ సామాగ్రిని బయట పెట్టుకుంటామని కాళ్ల మీద పడి వేడుకున్న కనికరం లేకుండా కూల్చివేతలు చేపట్టారని అన్నారు. రేవంత్​ రెడ్డి నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే చెరువులలో ఉన్న పట్టా భూములను సేకరించాలి, ప్రాజెక్టులకు భూములను సేకరించినట్టు వీటిని కూడా తీసుకోవాలని కోరారు.

చెరువులను కాపాడే మంచి అభిప్రాయం నిజంగానే ఉంటే హుస్సేన్​ సాగర్​లో నీళ్లు తాగేలా తయారు చేయాలని అన్నారు. అన్ని చెరువులు మురికి కూపాలుగా మారిపోయాయని, దుర్గంధ పూరితంగా మారాయని అన్నారు. హైదరాబాద్​లో ఎన్ని చెరువులో ఉన్నాయి, ఎన్ని మాయం అయ్యాయి, మాయం అవడానికి కారకులు ఎవరు తేల్చాలని అన్నారు. అంబర్పేట్​లోని బతుకమ్మ కుంటను ఎవరు మాయం చేశారు. కృష్ణకాంత్​ పార్కు ఎలా అయింది. మాసబ్​ ట్యాంక్​ చెరువు క్రికెట్​ గ్రౌండ్​ ఎలా తయారైందని అన్నారు. హుస్సేన్​ సాగర్​లో ప్రసాద్​ ఐమాక్స్​, జలవిహార్​, పారడైజ్​ బిర్యాని ఇవన్ని ఎఫ్​టీఎల్​ లోనే ఉన్నాయని ఆరోపించారు. రేవంత్​ రెడ్డి పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కూల్చివేతల బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్​రావు, అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, అనంత నాగరాజు, దుర్గాప్రసాద్, శంకర్ రెడ్డి, చంద్ర ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed