MP Eatala : అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడతా

by Sridhar Babu |   ( Updated:2024-11-03 12:34:30.0  )
MP Eatala : అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడతా
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అన్యాయానికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా కొట్లాడడమే తన వ్యక్తిత్వమని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చెరువులు, మూసీ ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదన్నారు. మూసీ బాగుండాలని, ఆ నీళ్లు నల్లగొండ రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో బంజారానగర్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంతోపాటు, కంటోన్మెంట్ టీచర్స్ కో ఆపరేటివ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కూలగొట్టి రాత్రికి రాత్రి బిచ్చగాళ్లుగా చేసే పనిని వ్యతిరేకించానని తెలిపారు.పేదల పక్షాన కొట్లాడుతున్నానని, పేదవారి గొంతుక అయినందుకు గర్వపడుతున్నా అన్నారు.

ప్రతిరోజూ తాను ప్రజల మధ్యనే ఉంటానని, పిలిస్తే పలికే వ్యక్తిని అని అన్నారు. ఎక్కడ ఆపద ఉన్నా మీ కుటుంబ సభ్యునిలాగా అందుబాటులో ఉంటా అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఎక్కువ పనులు జరుగుతాయన్నారు. కావున కంటోన్మెంట్ సర్వతోముఖాభివృద్ధికి తన వంతు పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు. తనని విద్యార్థి ఉద్యమం నుంచి ఈ సమాజం చూస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన గురించి సంపూర్ణంగా తెలుసన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ గా, మొట్టమొదట ఆర్థిక మంత్రిగా గెలిచానన్నారు.

మీరందరూ కరోనాతో భయపడుతున్న సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినట్లు తెలిపారు. తాను ఇక్కడ ఎంపీగా ఉన్నా కంటోన్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది కాబట్టి దేనికీ లోటు లేకుండా చూస్తానన్నారు. డ్రైనేజీ, రోడ్లు, సీసీ కెమెరాలు, కమ్యూనిటీ హాల్స్ ఇంకా ఏ సమస్య ఉన్నా ఎలా పరిష్కరించాలో తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, పరుశురాం, వనజ, నగేష్, ప్రశాంత్, సతీష్, విశ్వనాథ్​, పవన్ కుమార్, మోహన్, ఉదయ్, మనోహర్, సబితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed