ఎమ్మెల్యే మల్లారెడ్డికి అసంతృప్తి సెగ.. పార్లమెంట్ సమావేశానికి కౌన్సిలర్‌లు డుమ్మా

by Disha Web Desk 23 |
ఎమ్మెల్యే మల్లారెడ్డికి అసంతృప్తి సెగ.. పార్లమెంట్ సమావేశానికి కౌన్సిలర్‌లు డుమ్మా
X

దిశ,ఘట్కేసర్ : మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డికి అసంతృప్తి సెగ తగలనుంది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడానికి ఎమ్మెల్యే కారణమనే నెపంతో పార్టీని వీడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అనుమతితో ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముల్లి పావని పై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు, నాయకులు డుమ్మా కొట్టారు. అవిశ్వాసం తీర్మానం నోటీసులు ఇచ్చేందుకు ఉసిగొల్పిన ఎమ్మెల్యే ఇప్పుడు మెజారిటీ కౌన్సిలర్ల మధ్య చిచ్చురేపి, అవిశ్వాసం వీగిపోయేలా కుటిల రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

మున్సిపల్ చైర్ పర్సన్ పావని పై ఏప్రిల్ 10వ తేదీన మెజారిటీ కౌన్సిలర్ సభ్యులు బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. ఈలోగా ఎమ్మెల్యే మల్లారెడ్డి 12 మంది మెజారిటీ సభ్యులలో కొందరిని అవిశ్వాసానికి సహకరించకుండా దూరంగా ఉండేలా చేసేందుకు రాజకీయాలు చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముల్లి పావని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయం తెలిసి అవిశ్వాసానికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే తానే ఇప్పుడు వీగిపోయేలా చేసి ఘట్కేసర్ పట్టణంలో అవమానాలకు గురి చేస్తున్నాడని మనస్తాపం చెందిన కౌన్సిలర్లు, నాయకులు పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

మున్సిపాలిటీ లో కేడర్ ను పట్టించుకోకుండా ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్, బిజెపి పార్టీలలో చేరేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే వెంటే ఉన్న తమను ఇలా మోసం చేస్తాడా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఘట్కేసర్ మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యే మల్లారెడ్డి పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed