- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైరవీలతో డిప్యూటేషన్లు.. మేడ్చల్ జిల్లా విద్యాశాఖ వింత పోకడ
దిశ, మేడ్చల్ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసాక డిప్యూటేషన్లపై వచ్చిన ఉత్తర్వులపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. కానీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మాత్రం డిప్యూటేషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. డిప్యూటేషన్లు లేవంటూనే .. అక్టోబర్‌లో 11మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా పరిధిలో ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి.
ఉత్తర్వులు రద్దయినా..
రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో దాదాపు 30 వేల మందికి ప్రమోషన్లు, 40వేల మందికి బదిలీలు జరిగాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇచ్చి.. వారు కోరుకున్న ప్రాంతానికి పంపించారు. అందులో సరైన స్థానాలు దక్కని కొందరు టీచర్లు సర్కారు పెద్దల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి డిప్యూటేషన్లు, ఓడీలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. కాగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజులకే డిప్యూటేషన్ల ఉత్తర్వులు రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సర్కారు పెద్దలకు.. టీచర్ల సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఏదో ఒక కారణం చెప్పి బదిలీలకు అవకాశమిస్తే.. చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీలకు అవకాశమిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లే ఉండరని, దీంతో సర్కారుకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సర్కార్ పెద్దల ఆదేశంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇచ్చిన ఉత్తర్వులను అభయన్స్‌లో పెట్టారు. కానీ మేడ్చల్ జిల్లాలో మాత్రం ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల పరంపర కొనసాగుతోంది.
జోరుగా దందా..
జిల్లా విద్యాశాఖలో వింత పోకడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు, అన్ డ్యూటీల ఉత్తర్వులను నిలిపివేసిన, మరోవైపు వివిధ జిల్లాలో పనిచేస్తున్న 11 మంది టీచర్లు తమకున్న పలుకుబడితో పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయం నుంచి నేరుగా డిప్యూటేషన్ ఉత్తర్వులు తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు వెంటనే సదరు టీచర్లను రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల డీఈవోలపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో చేసేదేమి లేక పలువురు జిల్లాల విద్యాశాఖ అధికారులు సదరు టీచర్లకు రిలీవ్ అర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
డిప్యూటేషన్ల పరంపర..
ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం లో పనిచేస్తున్న ఓ టీచర్ భర్త హైదరాబాద్ లో పనిచేస్తుండగా భార్యను తన వద్దకు రప్పించేందుకు ఏకంగా రాష్ట్రస్థాయిలో పైరవీ చేసి మేడ్చల్ జిల్లాకు ఇటీవల డిప్యూటేషన్ ఇప్పించుకున్నారు. ఇదే తరహాలో గత నెల 5వ తేదీన 10 మంది టీచర్లకు డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీల కింద మేడ్చల్ జిల్లాలో పనిచేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీ పల్లి, జగ్గం గూడలో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న టి. విజయలక్ష్మికి నాగోల్‌కు ఆన్ డ్యూటీ ఉత్తర్వులు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం అన్నారం లో పనిచేస్తున్న డి. చంద్రకళకు ఉప్పల్ మండలం లో డిప్యూటేషన్ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సీహెచ్ అనూరాధ, బుర్ర సురేఖకు, ములుగు జిల్లాలో పనిచేస్తున్న జి జెరుషా రాణి, నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న జి ప్రతిభకు, మేడ్చల్ జిల్లాలోనే సురారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో కె.కవితను మూసాపేటలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలకు డిప్యూటేషన్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 31 జీవో కింద ఏడాదిగా కుటుంబాలకు దూరంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేదన అరణ్య రోదనగా తయారైందనే వాదనాలు వినిపిస్తున్నాయి.