నా భర్త నాకు కావాలి.. వివాహిత నిరసన...

by Sumithra |
నా భర్త నాకు కావాలి.. వివాహిత నిరసన...
X

దిశ, తిరుమలగిరి : గత 4 సంవత్సరాల నుండి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న తన భర్త తనకు కావాలని, తనతో కాపురం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం రంగాపురం గ్రామానికి చెందిన నవ్య అనే వివాహిత బుధవారం భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ పికెట్ విజయనగర్ కాలనీ చెందిన ఉదయ్ బాస్కర్ రెడ్డితో 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, వివాహ సమయంలో 30 తులాల బంగారం, 10 లక్షల రూపాయల నగదు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించినట్లు తెలిపింది. వివాహం అనంతరం అమెరికాలో సంవత్సరంన్నర కాపురం చేశామని, ఈ సమయంలో ఆయన తనతో ఉండకుండా ఎక్కువ సమయం అక్క తరంగిణి రెడ్డితోనే ఉండేవాడని తెలిపింది.

ఇదేంటి అని ప్రశ్నించినప్పుడల్లా తనను చిత్రహింసలు పెట్టేవారని తెలిపింది. తనను నిత్యం అనుమానిస్తు వేదించేవారని, అంతే కాకుండా తనను అసభ్యకరంగా వీడియోలు తీస్తూ అక్క తమ్ముళ్లు వేధించే వాళ్ళని, దీంతో తల్లిదండ్రులకు విషయం తెలిపి ఇండియాకు వచ్చి వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినట్టు తెలిపింది. వివాహం సమయంలో తీసుకున్న బంగారం నగదే కాకుండా తాను అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన 20 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన బంగారం సైతం వారి వద్దనే ఉంచుకొని చిత్రహింసలకు గురిచేసి వెల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చదువుకున్న సర్టిఫికెట్లను సంవత్సరాలు తరబడి వారి వద్దనే ఉంచుకొని, గత మూడు నెలల క్రితం ఇచ్చారని దీంతో తాను ఎంతో ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిపింది. గత రెండు మూడు రోజులుగా తన భర్త కావాలంటూ ఇంటికి వస్తున్న సమయంలో ఇంట్లో వాళ్ళు తనను వీడియో కాల్స్ ద్వారా భర్తకు చూపిస్తున్నారని, కనిపించకుండా పోయిన తన భర్త తనతో కాపురం చేసే విధంగా తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.

4 సంవత్సరాల నుండి తనకు కాంటాక్ట్ లో లేకుండా ఉన్న తన భర్త ఉదయ్ కుమార్ రెడ్డి రెండో వివాహం చేసుకొని వేరే కాపురం చేస్తున్నాడని తనకు అనుమానాలు ఉన్నాయని, అందుకే అతన్ని చూపించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. తనకు న్యాయం కావాలని మంగళవారం సికింద్రాబాద్ లోని పికెట్ లో ఉన్న భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తుంటే ఈ నెల 25 వరకు వాళ్ళ ఇంటి ముందు ఎలాంటి ఆందోళన చేపట్టొద్దని రాత్రికి రాత్రే కోర్టు నుండి ఆర్డర్ తీసుకురావడం ఎంతవరకు సమంజసమని, ఈ సమాజంలో తనకు న్యాయం జరుగుతుందా లేదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు, ప్రభుత్వం, పోలీసులు తన భర్త తనకు దక్కేల న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. తన భర్తను చూపించి తనతో కాపురం చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే నిరసన విరమించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed