అక్రమ నిర్మాణాలను అరికట్టేది ఎవరు..?

by Aamani |
అక్రమ నిర్మాణాలను అరికట్టేది ఎవరు..?
X

దిశ,ఉప్పల్:సాధారణంగా భవన నిర్మాణానికి జీ ప్లస్ టూ అనుమతులు లేదా జీ ప్లస్ ఫైవ్ అనుమతులు జారీ చేస్తారు. జనావాసాల మధ్య భారీ షెడ్లు నిర్మాణం చేసేందుకు మాత్రం ఎటువంటి అనుమతులు జారీ చేయరు. కానీ ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి.ఉప్పల్ డివిజన్ పరిధిలో భగాయత్ లో ఓ వ్యక్తి భారీ షెడ్డు నిర్మాణం చేపట్టాడు.ఇంత భారీ ఎత్తున అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.

అక్రమ నిర్మాణమని నోటీసులు ఇచ్చినప్పటికీ..

ఉప్పల్ భగాయత్ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి భారీ ఎత్తున పెద్ద షెడ్డు నిర్మాణం చేపట్టాడు. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ నిర్మాణంపై ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు ఆగిన నిర్మాణం ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉండటం గమనార్హం. నోటీసులు ఇచ్చి హెచ్చరికలు చేసినా ఆ నిర్మాణం కొనసాగుతుందంటే వ్యవహారం ఏ రీతిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్తులో ప్రమాదాలు తప్పవు..

జనావాసాల మధ్య అక్రమ షెడ్లు, గోదాంలు నిర్మించి వివిధ కార్యకలాపాలకు వినియోగిస్తే సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం తరహాలో భవిష్యత్తులో అదే తరహా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనుమతులు తీసుకుని భారీ నిర్మాణాలు చేపట్టిన భవనాల్లోనే సరైన జాగ్రత్తలు పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది.అలాంటి సందర్భంలో ఇలా అక్రమంగా నిర్మించిన షెడ్ల నిర్మాణాల పట్ల ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారో తెలియదు. ఇలాంటి తరుణంలో ఎక్కడికక్కడ షెడ్ల నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది.

పేదలు.. బలహీనులపై మాత్రం ప్రతాపం..

కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రమాదకరంగా షెడ్ల నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు పేదలు, బలహీనులు చేసుకుంటున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.ఇటీవలే ఉప్పల్ భగాయత్ లో పేదోడు టిఫిన్ సెంటర్ల కోసం,చాయ్ బండి కోసం షెడ్ల నిర్మాణం చేపట్టగా ఫిర్యాదులు వచ్చాయంటూ ఆగమేఘాల మీద కూల్చివేతకు వచ్చారు టౌన్ ప్లానింగ్ అధికారులు. పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేని టౌన్ ప్లానింగ్ అధికారులు పేదలపై మాత్రం తమ ప్రతాపం చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed