బిడ్డా బీకేర్ ఫుల్.. సీఎంను తూలనాడితే ప్రజలు ఉరికించి కొడతారు.. కాంగ్రెస్ నేతలు

by Sumithra |
బిడ్డా బీకేర్ ఫుల్.. సీఎంను తూలనాడితే ప్రజలు ఉరికించి కొడతారు.. కాంగ్రెస్ నేతలు
X

దిశ, కుత్బుల్లాపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోపిడీ దందాలు చేసి, ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లిన నాయకులు కడిగిన ముత్యంలా కాంగ్రెస్ ప్రభుత్వం పై, సీఎం రేవంత్ , మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, విమర్శల పై ధ్వజమెత్తారు. మచ్చలేని నాయకుడు తమ నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అని అలాంటి ప్రజాబలం ఉన్న నాయకుడి పై నోరు జారీ మాట్లాడితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఒకడేమో బాలానగర్ లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ పోలీసులకు దొరికిన కార్పొరేటర్, మరొక్కడేమో 35 ఎకరాలు భూమిని ఫోర్జరీ డాక్యూమెంట్స్ తో కబ్జా చేయాలని చూసి జైలుకు వెళ్లిన కార్పొరేటర్, మరొకడు బలహీన వర్గాల బలహీనతను క్యాష్ చేసుకుని రాజీవ్ గృహకల్ప ఎక్స్ టెన్షన్ చేసిన ఘనుడన్నారు. వీళ్లా మా కాంగ్రెస్ నాయకుడి పై మాట్లాడేది అంటూ బీఆర్ఎస్ నేతల తీరు పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన బేషుగ్గా జరుగుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు అవాకులు, చెవాకులు పేలడం ప్రజా అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే అని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు విషయంలో ఎమ్మెల్యే వివేకానందకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రస్తుత బీఆర్ఎస్ కార్పొరేటర్ లు ప్యాకేజి అందగానే మా ఎమ్మెల్యే అంటూ నీతి మాలిన మాటలు మాట్లాడడం కుత్బుల్లాపూర్ ప్రజలను విస్మయానికి గురిచేస్తుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాజకీయ భిక్షతో కార్పొరేటర్లు అయిన నాయకులు నేడు సీఎం రేవంత్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బొడ్డు వెంకటేశ్వరరావు, పాలకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి పున్నారెడ్డి, మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు గుంజా శ్రీనివాస్, బండి శ్రీనివాస్ గౌడ్, క్రిష్ణగౌడ్, జయరాం, రషీద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed