- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండ్లు ఇచ్చిన.. పట్టాలు ఇవ్వలేదు.. దీనులంటే లెక్కలేదా..?
దిశ,మేడ్చల్ బ్యూరో : ఆర్బాటపు కేటాయింపులే తప్ప.. డబుల్ బెడ్ రూమ్ లలో కనీస వసతుల ఊసే లేదు. లబ్దిదారులను హడావిడిగా డబుల్ ఇండ్లలోకి పంపించారు. కానీ ఆ ఇళ్లకు సంబంధించిన పట్టాలు మాత్రం ఇవ్వలేదు.కనీసం విద్యుత్,మంచినీళ్లు వసతులు కూడా కల్పించలేదు.అంతర్గత రోడ్లు నిర్మించలేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వేసిన ‘డబుల్ ’ స్టంట్.. ఇది అప్పటి కార్మిక శాఖ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రతినిధ్యం నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పట్టాలు ఇప్పించడంతోపాటు కనీస వసతులు కల్పించాలని లబ్దిదారులు నిత్యం కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కీసర మండల కార్యాలయం ముందు లబ్ధిదారులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మౌలిక వసతులు కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఏళ్లుగా అదే అవస్థలు..
మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని కీసర మండలం చీర్యాలలో 2016 నవంబర్ 28వ తేదీన 40 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ల తర్వాత 2020,అక్టోబర్ 7వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లబ్దిదారులకు ఇళ్లు కేటాయించారు. అప్పటి మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, నాటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు లబ్దిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లు కేటాయించినట్లు ప్రకటించారు. అయితే వారికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపు సమయంలోనే ఇళ్లను నిజమైన లబ్దిదారులకు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక లీడర్ల అనుయాయులకే కేటాయించారని చీర్యాల గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఇండ్లను పొందిన లబ్దిదారులు నాటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. కొందరు పొద్దంతా ఉంటూ రాత్రి వేళ చీర్యాల గ్రామంలో నిద్రిస్తున్నారు. ఇళ్లు కేటాయించినా ఎక్కడ వారి ఇంటిని ప్రభుత్వం తీసుకుంటుందో నన్న భయంతో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఇండ్లను కేటాయించినా అప్పటి ప్రభుత్వ పెద్దలు గానీ, ప్రస్తుతం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు.
కరెంట్, నీళ్లు లేక అవస్థలు..
సొంతింటి కల సాకారమైందనుకుని గంపెడాశలతో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన లబ్దిదారులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. నీటి కోసం పక్కనున్న పంట పొలాలకు పరుగులు తీయాల్సి వస్తోందంటున్నారు. తీరా అక్కడికి వెళ్లితే రైతులు రోజు నీళ్లు ఇవ్వాలా..? అంటూ చీదరించుకుంటున్నారని వాపోతున్నారు.పంట పొలాల నుంచి నీళ్లు తీసుకుని వస్తుంటే చాలాసార్లు పొలాల గట్లపై జారిపడిన సందర్భాలున్నాయి. తాగునీటి ట్యాంకర్ ను పంపమంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించినా.. కరెంట్ పోల్స్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రిపూట కరెంటు లేక చీమ్మ చీకట్లలో జాగారం చేయాల్సి వస్తుందంటున్నారు. చీకట్లో బయటకు వచ్చినందున బక్కని మల్లమ్మ ను రెండు సార్లు పాము కాటేసింది.
ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఈ భయంతో పక్కనే ఉన్న కరెంట్ పోల్స్ నుంచి అక్రమంగా విద్యుత్ ను వాడుతున్నందుకు, ఆ శాఖ అధికారులు ఒక్కో ఇంటిపై 5 కేసులు నమోదు చేసి వేధిస్తున్నట్లు లబ్దిదారులు వాపోతున్నారు. ఒక్కో ఇంటికి రూ. లక్షల్లో జరినామాలు విధించారని ఆ డబ్బులు కట్టాలని ఒత్తిడి తేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు వేసిన.. ఆ పైపులైన్ల నుంచి ఇళ్లకు మురుగు నీరు బయటకు వెళ్లేందుకు ఔట్ ఫ్లో ఏర్పాటు చేయలేదు. దీంతో మురుగు నీరు బయటకు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది రూపాయాలతో ఇండ్లను కట్టించిన ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించకపోవడంతో లబ్దిదారులు నానా అవస్థలు పడుతున్నారు.
నీళ్లు లేక అవస్థలు : సత్తెమ్మ, స్థానికురాలు
డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినా నీటి సౌకర్యం కల్పించలేదు. తాగేందుకు మంచినీరు లేక , కనీసం కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బుందులు పడుతున్నాం. పక్కనున్న పొలాల వద్ద బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. నాలుగు ఏళ్లుగా ఇదే పరిస్థితి. సమస్యను పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు.
రెండు సార్లు పాముకాటుకు గురయ్యా..: బక్కని మల్లమ్మ, స్థానికురాలు
విద్యుత్ సౌకర్యం లేక చీకట్లలోనే జీవనం సాగిస్తున్నాం. కోట్లాది రూపాయాలు వెచ్చించి ఇండ్లను నిర్మించినా కరెంట్ సౌకర్యం కల్పించలేదు. కనీసం పోల్స్ కూడా వేయలేదు. చిన్న పిల్లలోనే చీకట్లోనే జీవించాల్సి వస్తోంది. రెండు సార్లు తనను పాము కాటు వేసింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను. రాత్రిపూట దోమలు కుడుతున్నాయి. కంటి మీద కునుకు ఉండడంలేదు.
పట్టాలు ఇవ్వలేదు : చంద్రకళ, స్థానికురాలు
డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి హడావిడిగా పంపించారు. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇండ్లకు సంబంధించిన పట్టాలు ఇవ్వలేదు. దీంతో మేము కరెంట్ మీటర్ కోసం, నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. 40 ఇండ్లలో దాదాపు 200 మంది వరకు నివాసం ఉంటున్నాం. ఇంత జనాభకు నీళ్లు ఇచ్చేందుకు పంట పొలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేక విద్యార్థులు చదువు కోవడం లేదు. కనీసం సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలన్నా కష్టంగా మారింది.