టీయూడబ్ల్యూజేతోనే జర్నలిస్టులకు న్యాయం.. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

by Sumithra |
టీయూడబ్ల్యూజేతోనే జర్నలిస్టులకు న్యాయం.. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
X

దిశ, జవహర్ నగర్ : సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని, ఈ సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 22 మంది సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 143 మంది సంఘానికి రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని కార్యాలయంలో విరాహత్ అలీ సమక్షంలో టీయూడబ్ల్యూజే - ఐజేయులో చేరారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ పార్టీలకు, ప్రభుత్వాలకు అనుబంధంగా పనిచేసే సంఘాలు మనుగడ సాధించలేవని, గడిచిన 65 ఏండ్లలో తమ సంఘం ఎన్నో పార్టీలను, ఎన్నో ప్రభుత్వాలను చూసిందని, అయినా ఎప్పుడూ జర్నలిస్టుల గొంతుకగానే పనిచేస్తూ వస్తుందని అన్నారు.

అందుకే నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. సంఘ సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండే జర్నలిస్టుల సంక్షేమ చర్యల పై నిమగ్నమై పోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభ్యత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని, త్వరలో వేలాది మంది జర్నలిస్టులతో హైదరాబాద్ లో భారీ సభను నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సమాచార, ఆరోగ్య శాఖల మంత్రులను ఆ సభకు ఆహ్వానించి, జర్నలిస్టుల ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నయ్య, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక సంఘం ఐజేయు.. రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక సంఘం టీయుడబ్ల్యూజే ఐజేయు అని రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు అన్నారు. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల పై ఎలాంటి దాడులు జరిగినా సహించబోమని, జర్నలిస్టుల హక్కుల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని అన్నారు. వాస్తవాలను వెలికి తీసి సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న జర్నలిస్టుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సాక్షి టీవీ మాలే రాజేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి టీవి9 సురేష్, కోశాధికారి ఐ న్యూస్ నరసింహా, ఎన్టీవీ వినోద్, వీ6 పుల్లయ్య, మహా న్యూస్ రామ్ రెడ్డి, టీ న్యూస్ కేశవులు, 99టీవీ రాజేష్ గౌడ్, హెచ్ఎంటీవీ వెంకటేష్, 10టీవీ చాంద్ పాషా, ప్రైమ్ న్యూస్ సతీష్, 6టీవీ ప్రదీప్, అమ్మ న్యూస్ వెంకటేష్, టీవీ5 రమేష్, స్వతంత్ర టీవీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story