Aarogya Sree: ‘ఆరోగ్య శ్రీ’ బకాయిల పాపం బీఆర్ఎస్‌దే..!

by Shiva |
Aarogya Sree: ‘ఆరోగ్య శ్రీ’ బకాయిల పాపం బీఆర్ఎస్‌దే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘ఆరోగ్య శ్రీ’ బకాయిలు పెండింగ్ పడటానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లులను రెగ్యులర్‌గా చెల్లించకపోవడం, నెట్‌వర్క్ యాజమాన్యాలతో చర్చలు జరిపి.. పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడం వల్లే రూ.వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటి బీఆర్ఎస్ పాలకుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఆరోగ్య శ్రీ సేవల అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులపై ప్రభావం పడుతున్నదనే చర్చ జరుగుతున్నది. నాడు రెగ్యులర్‌గా బిల్లులు చెల్లించకుండా, నెలల కొద్ది పెండింగ్‌లో పెట్టడంతో అవి తడిసి మోపడయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పాలనలో రూ.1,137 కోట్లు చెల్లింపు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.724 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బకాయిలతో పాటు ప్రస్తుత బిల్లులను సైతం క్లియర్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తున్నది. ఇప్పటివరకు రూ.1,137 కోట్లను రేవంత్ సర్కారు చెల్లించింది. బకాయిలను సైతం క్లియర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది.

నాడు బెదిరింపులు.. నేడు సంప్రదింపులు

ఆరోగ్య శ్రీ కింద సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులపై బీఆర్ఎస్ హయాంలో కండీషన్లు పెట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు బిల్లులు ఇవ్వాలని నోరు తెరిచి అడిగేవి కాదు. ఎవరైనా ధైర్యం చేసి బిల్లులు ఇవ్వాలని అడిగితే బెదిరించిన సందర్భాలూ ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితమైన కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రం బిల్లులు రెగ్యులర్‌గా చెల్లించేవారని టాక్. బిల్లులు చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలు నిలిపివేస్తే కనీసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు సైతం చేయలేదు. చివరికి విసిగిపోయిన ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలను తిరిగి పునరుద్ధరించినట్టు టాక్. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఆస్పత్రుల ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా స్వయంగా సంప్రదింపులు జరిపారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య స్నేహపూర్వక వాతవరణం నెలకొందని, గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని చర్చ జరుగుతున్నది.



Next Story