ఆ జిల్లాల్లో నూతన పంచాయతీలకు ప్రతిపాదనలు

by Ramesh Goud |
ఆ జిల్లాల్లో నూతన పంచాయతీలకు ప్రతిపాదనలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తున్నది. స్ధానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణలతో ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రతిపాదించిన గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఎన్నికల నోటిఫికేషన్​కు ముందే ప్రకటించే అవకా శం ఉంది. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సైతం సర్పంచ్​ ఎన్నికలు జరుగుతాయి.

పరిపాలన సౌలభ్యం కోసమే..

ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు కిలోమీటర్‌, రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న గూడేలను, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దాదాపు అర్బన్​ ప్రాంతాల్లో గూడేలను, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పాలన సౌకార్యర్థం.. పాలన వికేంద్రీకరణ చేయాలన్న ఉద్దేశ్యం తో చిన్న చిన్న తండాలను, గూ డేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు నివేదికను సిద్ధం చేస్తోంది.

స్వయం పాలన వైపు తండాలు, గూడేలు..

ఇప్పటి వరకు తండాలు, గూడేలుగా ఉంటూ.. రెండు, మూడు కిలో మీటర్ల దూరం వెళ్లి గ్రామ పంచాయతీలో తమ సమస్యలు చెప్పుకోవడం.. తమ గూడేలు, తాండాల మీద ఇతరులు పెత్తనం చెలాయించడం, తండాలు, గూడేల అభివృద్ధికి దూరంగా ఉండడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిని అధిగమించేందుకు గత ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసినప్పటికీ.. జిల్లాలో జనాభా ప్రాతిపదికన కొన్ని తండాలు, గూడేలు మేజర్‌ జీపీలకు అనుబంధంగా ఉండిపోయాయి. వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. స్థానిక ఎన్నికల వరకు నూతన పంచాయతీల గెజిట్‌ విడుదల చేస్తే.. సర్పంచ్‌ ఎన్నికలు తమ గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవచ్చని ఆయా గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నూతన గ్రామ పంచాయతీలకు నివేదిక..

నూతన గ్రామ పంచాయతీల రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నివేదికలో రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి, ఇబ్రహీంటప్నం, షాద్‌నగర్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో 21.. వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల పరిధిలో 18 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని జిల్లాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా నుంచి పంపించిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌తో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి.

స్థానిక ఎన్నికల్లో ఈ జీపీలకు..

స్థానిక ఎన్నికలకు వెళ్లే సమయానికి ప్రభుత్వం కొత్త పంచాయతీలకు గెజిట్‌ ఇవ్వనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండనున్నట్టు అంచనాలు ఉన్నాయి. అధికారులు సూత్రపాయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయానికి కొత్త గ్రామ పంచాయతీల గెజిట్‌ విడుదల అయితే.. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆ గ్రామాలకు ఉండనుందని ఆ గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed