Dharani: ధరణి.. పరేషానీ..! సీఎం రేవంత్ ఆదేశాలు బేఖాతరు

by Shiva |
Dharani: ధరణి.. పరేషానీ..! సీఎం రేవంత్ ఆదేశాలు బేఖాతరు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో తహసీల్దార్ల నుంచి కలెక్టర్ వరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం విస్మయం కలిగిస్తోంది. జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్లు సీసీఎల్ఏకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లుతున్నాయి. ధరణి దరఖాస్తులను ఏకారణంతో తిరస్కరించారో కూడా రైతులకు సరైన సమాధానం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే మేడ్చల్ జిల్లా కేవలం 5 రూరల్ మండలాలతో విస్తరించి, అతి తక్కువ భూ సమస్యలున్న చిన్న జిల్లా. కానీ ఏడాది కాలంగా ఇప్పటికి 4,361 ధరణి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తహసీల్దార్ల నుంచి కలెక్టర్ వరకు..

జిల్లాలో ప్రస్తుతం మొత్తం 4361 ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా..ఇందులో తహసీల్దార్ల వద్ద 1,716, ఆర్డీఓల వద్ద 1,141, అదనపు కలెక్టర్ వద్ద 915, కలెక్టర్ వద్ద 589 పరిష్కారం కావాల్సిన దరఖాస్తులు ఉన్నట్లు తాజా గణాంకాల వెల్లడిస్తున్నాయి. అయితే, ఇందులో చాలా వాటిని తహసీల్దార్లు తిరస్కరిస్తుండడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా కారణం తెలుపడంలేదని మేడ్చల్‌కు చెందిన రైతు పరశురాం వాపోతున్నారు. జిల్లాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా అంతకు రెట్టింపు ప్రజావాణి, ఇన్‌వార్డుల ద్వారా కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. ఇక్కడ ఇచ్చిన దరఖాస్తులు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకపోవడంతో కొందరు బాధితులు ప్రజాభవన్‌కు వెళ్లి దరఖాస్తులను సమర్పిస్తున్నారు. మండల స్థాయిలో దరఖాస్తుల పెండింగ్‌కు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడంతో పాటు పైరవీలు, ముడుపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శులు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలతో జిల్లాలో ఓ తహసీల్దార్ ఇప్పటికే లాంగ్ లీవ్‌లో వెళ్లగా, కొంతమంది మండల స్థాయి అధికారులు అమామ్యాల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆప్షన్లు ఇచ్చినా..

వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, నిర్వహణకు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు అన్ని సర్వే నెంబర్లను పాస్‌బుక్‌ల ఆధారంగా ఆన్‌లైన్ చేశారు. పాస్ బుక్‌లు లేని వాటిని పెండింగ్‌లో పెట్టారు. ప్రభుత్వ, వక్ఫ్, కాల్వలు, దేవాదాయ ఇతర గ్రామ పంచాయతీ భూములన్నింటిని నిషేధిత జాబితాలో ఉంచారు. ఒక సర్వే నెంబరులో ప్రభుత్వ భూమి ఉండి అదే సర్వే నెంబర్‌లో ప్రైవేట్ భూమి ఉన్నా ఆ నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయింది. దీంతో సదరు యజమానులు వాటిని క్రయవిక్రయాలు చేసుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. నిషేధిత జాబితాలో పడిన సర్వేనెంబర్ల వారికి పాస్ బుక్‌లను ఇవ్వలేదు. దీంతో ఆ రైతులంతా రైతుబంధు, రైతు భీమాకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది. గతంలో మాదిరిగా కలెక్టర్ స్థాయిలో కాకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగించింది. మండల స్థాయిలో పరిష్కరమయ్యే వాటిని తహసీల్దార్ల వద్దనే చేసేలా, అక్కడ కానివి ఆర్డీవోకు పంపేలా..అక్కడా పరిష్కారం కానివి అదనపు కలెక్టర్, కలెక్టర్ వద్ద క్లియర్ చేసేలా చర్యలు తీసుకున్నారు. అయినా, ధరణి దరఖాస్తులను పరిష్కరించడంలో అలసత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

సీఎం ఆదేశాలు బేఖాతరు..

ఈనెల 15వ తేదీలోపు ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఆ ఆదేశాలను జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూలై 16న కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ధరణి సమస్యలపై సమీక్షించారు. అంతకు ముందుకు కూడా ధరణి సమస్యలపై సీఎం సమీక్ష చేశారు. దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రధాన్యత ఇవ్వాలని ఆగస్టు 15 నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్ధేశ్యంతో అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.

Advertisement

Next Story