దర్జాగా..కబ్జా

by Sridhar Babu |
దర్జాగా..కబ్జా
X

దిశ, మేడ్చల్ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం అండతో చెరువును చెరబట్టారు. బఫర్ జోన్ లో రోడ్డు వేశారు. నిషేధిత జాబితాలో ఉన్న స్థలంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇచ్చారు. దీంతో ఎంఎస్ఎం వెంకట సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని లింగం చెరువు బఫర్ జోన్ ను కబ్జా చేసి శాంభవతి లేక్ వ్యూ అపార్ట్ మెంట్లను నిర్మించి, అమాయకులకు విక్రయించి రూ. కోట్లలో సోమ్ము చేసుకుంటుంది. నిషేధిత జాబితాలో శాంభవతి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్

భూములు..సూరారం గ్రామ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 87, 88, 89 ల భూములలో ఎం ఎస్ ఎం వెంకట సాయి బిల్డర్స్ అనే నిర్మాణ సంస్థ శాంభవతి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ పేరిట కమర్షియల్, రెసిడెన్షియల్ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంది. సర్వేనెంబర్ 87, 88, 89 లను పేర్కొంటూ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి జీహెచ్ఎంసీలో అనుమతుల కోసం దరఖాస్తు చేయగా 2022, ఏప్రిల్ నెలలో హెచ్ఎండీఏ అనుమతులను జారీ చేసింది. అయితే సర్వేనెంబర్ 87, 88 లలో ఉన్న భూమి ధరణి రికార్డుల ప్రకారం ప్రొహిబిటెడ్ లాండ్స్ జాబితాలో ఉండడం విశేషం. ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిలో హెచ్ఎండీఏ ఏ విధంగా అనుమతులు జారీ చేసింది అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

బఫర్ జోన్ లో సైతం..

సర్వేనెంబర్ 87, 88, 89 లలో లింగం చెరువు బఫర్ జోన్ లలో కొద్దిమేర ప్రాంతం కలిసి ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 87 లో 0.016 గుంటల పట్టా భూమి, సర్వేనెంబర్ 88లో 0.011 గుంటల పట్టా భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా ధరణి రికార్డులలో కనిపిస్తుంది. ఇక సర్వేనెంబర్ 89 లో 1.05 ఎకరాల భూమిని బి. సుప్రభా పేరిట నాల కన్వర్షన్ అయినట్లుగా చూపిస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు సదరు నిర్మాణానికి అనుమతులు బి. సుప్రభా పేరిటనే జారీ చేశారు. నిషేధిత భూమిలో జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు జారీ చేయడంతో నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్, కమర్షియల్

భవన నిర్మాణాలను దాదాపుగా పూర్తిచేసింది. అయితే ఎంఎస్ ఎం వెంకట సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ నిషేధిత భూమిలో నిర్మాణం చేయడంతో పాటుగా చెరువు బఫర్ జోన్ ప్రాంతాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతుంది. ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ఈ నిర్మాణ సంస్థ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల సహకారం పుష్కలంగా ఉందని అంటున్నారు. అందువల్లనే అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదంటున్నారు. చెరువులను చెరబట్టి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో..వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed