Telangana High Court : ఆ ఐదుగురు అధికారుల పై కేసు నమోదు చేయండి..

by Sumithra |
Telangana High Court : ఆ ఐదుగురు అధికారుల పై కేసు నమోదు చేయండి..
X

దిశ, కాప్రా : ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని, హైకోర్టు స్పష్టం చేసిందని ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా పూర్వపు తహశీల్దార్ ఎస్తేర్ అనిత, పూర్వపు సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, పూర్వపు కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశం పై విచారణ జరిపి, అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ బుధవారం వెల్లడించారు. కాప్రా మండలంలో సర్వే నెంబర్ 199 లోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 177 లో పట్టా భూమిగా చూపిస్తూ కొంత మంది భూ ఆక్రమణ దారులతో కలిసి అప్పటి కాప్రా మండల తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేసి, పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన లొకేషన్ స్కెచ్స్ మ్యాప్ జారీ చేశారని తెలిపారు. అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు.

అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్దారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీసీఎల్ఏ కమీషనర్ కు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారుల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజిగిరి కోర్టు లో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది.

దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని హై కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని విధుల్లో నేరానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ నిందితుల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించింది. విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరుపు న్యాయవాది నరేష్ తెలిపారు.

Advertisement

Next Story