కన్నేశారు.. కాజేస్తున్నారు.. రూ. వందల కోట్ల విలువైన స్థలం ఆక్రమణ

by Aamani |
కన్నేశారు.. కాజేస్తున్నారు.. రూ. వందల కోట్ల విలువైన స్థలం ఆక్రమణ
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు నిర్మాణాలు వెలుస్తాయి.. అనుమతులతో పనిలేదు. సమధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. అడిగే దిక్కే లేదు. కబ్జా చేయడం.. కట్టడాలు లేపడం.. ఇదే భూ కబ్జాదారుల సూత్రం..మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ మండలంలోని జొన్నబండలో దాదాపు 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇదే జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధుల అండతో భూ అక్రమణదారులు ఈ దందాకు దిగారు. రూ.వందల కోట్లు పై చిలుకు విలువ చేసే ఈ స్థలం కబ్జా కథేంటో మీరే చదవండి..

ఖరీదైన స్థలం హాంఫట్..

మేడ్చల్ మల్కాజ్ గిరి జల్లా అల్వాల్ లో సర్వే నెంబర్ 582,583 లలో రూ. కోట్ల విలువ చేసే సుమారు 55 ఎకరాల భూమి ఉంది. ఇది అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ గజం ధర రూ.50 వేల నుంచి రూ. 80 వేల వరకు పలుకుతోంది.ఇంతటి ఖరీదైన స్థలంపై భూ కబ్జాదారుల కన్ను పడింది.ఇంకేముంది తప్పుడు పత్రాలు సృష్టించారు.లే అవుట్ పేరిట ప్లాట్లుగా ప్రభుత్వ స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ భూ అక్రమణదారులకు కొందరు ప్రజాప్రతినిధులు తోడయ్యారు. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అప్పనంగా కొన్ని ప్లాట్లు కొట్టేశారు.దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం చర్యలకు వెనుకాడింది.దీంతో రూ. వందల కోట్ల విలువైన సర్కారీ స్థలం హారతి కర్పూరంలా కరిగిపోతుంది.

కోర్టు ఆదేశించినా..

అల్వాల్ లో సర్వే నెంబరు 582,583 లలో కబ్జాకు గురైన స్థలం పై విచారణ చేపట్టాలని హై కోర్టు మేడ్చల్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని 2023, నవంబర్ 21న కోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. కాగా 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు రక్షణా చర్యలు చేపట్టక పోవడాన్ని సవాలు చేస్తూ 2020లో న్యాయవాది కె.విజయ్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణకు పిటిషనర్ హాజరు కాలేదు. ప్రైవేటు వ్యక్తి ఎం.జనార్దన్ తరపు న్యాయవాది ఆ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ విక్రయ దస్తావేజు తేదీల వివరాలను వెల్లడించలేదు.

ప్రత్యేక పరిస్థితులున్న ఈ వ్యవహారంలో పిటిషనర్ తో పాటు భూమి పై హక్కులున్నాయంటున్న వారందరికీ నోటీసులు జారీ చేయాలని కోర్టు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. భూమి పై హక్కులకు సంబంధించి తగిన పత్రాలను సమర్పించడానికి తగిన అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.ఒకవేళ అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. కోర్టు ఆదేశాలు జారీ చేసి 10 నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ ఆ స్థలంలో కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed