దశాబ్ది భారం మోయలేం.. ఊరూర చెరువుల ఉత్సవాలకు అరకొర నిధులు

by Kalyani |
దశాబ్ది భారం మోయలేం.. ఊరూర చెరువుల ఉత్సవాలకు అరకొర నిధులు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అసలే నిధుల లేమితో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. జీపీలలో సరిపడ నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. చేసిన అభివృధ్ది పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. మరమ్మత్తులకు డబ్బుల్లేక తిప్పలు పడుతున్నారు. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకు మించిన భారమైతే.. సర్పంచ్ లపై తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. ఈ నెల 8వ తేదీన గురువారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించాలని తెలంగాణ సర్కారు అదేశాలు జారీ చేసింది. దీంతో నిధుల్లేక ఊరూర చెరువుల పండుగను నిర్వహించలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది.


క్లారిటీ లేదు..

ఊరూర చెరువుల పండగ కోసం గ్రామ పంచాయతీలే ఖర్చులను భరించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీలుండగా, వీటిల్లో దాదాపు 15 జీపీలలో నిధుల కొరత వేధిస్తోంది. నిధులు లేని చిన్న పంచాయతీలకు పండగ ఖర్చుల కోసమని ప్రభుత్వమే రూ. 25 వేలు కేటాయిస్తుందని సమాచారం. మిగతా గ్రామ పంచాయతీలకు మీ జీపీ నిధుల నుంచే ఖర్చు పెట్టి బిల్లులు పెట్టుకోవాలని జిల్లా అధికారులు మౌకిక అదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఏ గ్రామ పంచాయతీ (మేజర్ /మైనర్ ) కి ఎన్ని నిధులు ఖర్చు పెట్టాలనే వివరాలను వెల్లడించలేదు. దీంతో సర్పంచ్ లకు, కార్యదర్శులకు క్లారిటీ లేదు.

ఖర్చులు బారేడు..

ఊరూర చెరువుల పండగను ధూంధాం నిర్వహించాలని సర్కార్ అదేశించింది. చెరువు కట్ట వద్ద రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా దారిని విస్తరించాలి. బారీ కేడ్లను ఏర్పాటు చేయాలి. ఉత్సవాలను సాయంత్రం ప్రారంభించనున్న నేపథ్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరా లేకపోతే జనరేటర్ సౌకర్యాన్ని కల్పించాలి. చెరువు కట్టపై ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించాలని సూచించింది. విద్యుత్ కాంతులతో జిగేల్ అనిపించేలా లైటింగ్ ను ఏర్పాటు చేయాలి. గజ ఈతగాళ్లను, వాలంటీర్లను చెరువు దగ్గర ఉంచాలి. తక్కువలో తక్కువ 5 జతల డప్పులు ఉండేలా చూడాలి. కట్ట మైసమ్మకు పూజలు చేసేందుకు పూజరిని తీసుకురావాలి.

పూజ సామాగ్రిని సిద్ధం చేయాలి. గ్రామ ప్రగతి నివేదికపై కరపత్రాలు, ప్లెక్సీలు ప్రింట్ చేయించాలి. అంతేకాకుండా ఈ పైసలతోనే బోనాలు, బతుకమ్మలు, డీజేలు, లైటింగ్, మైకులు, టెంట్లు ఏర్పాటు చేయాలి. సభ వేదికలను పూలతో అలంకరించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు నిర్వహించాలి. గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు‘ పాటను వినిపించాలి. జిల్లాలో సాగునీటి రంగంలో (ఇరిగేషన్) వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్భ జలాల పెరుగుదల తదితర వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.

నాన్ వేజ్ తో భోజనాలు..

చెరువు పండుగ నేపథ్యంలో తెలంగాణ వంటకాలు గుమగుమలాడాలి. గ్రామస్తులందరికి నాన్ వేజ్ తో భోజనం పెట్టాలి. మెనులో వైట్ రైస్, చికెన్ కర్రీ, పాపడ్, చట్నీ, బీర కాయతో పాటు ఏదైనా మరో వేజిటెరియన్ కర్రీ ఉండాలి. సాంబార్ , పెరుగు, రసం ఇలా అన్ని రకాల రుచులతో వంటకాలు తయారు చేయించాలి. వంటకాల కోసం సామాగ్రి, వంట మనుషులను ఏర్పాటు చేసుకోవాలి. దీనికి తోడు పండుగ నిర్వహించే చెరువ వద్ద భారీ వేదికను ఏర్పాటు చేయాలి. వేదిక తోపాటు భోజనాలు చేసే స్థలాన్ని చదును చేయాలి. టెంట్లు, కుర్చీలు, మంచినీళ్లు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి. ఇలా నాన్ వేజ్ తో భోజనం ఏర్పాటు చేయాలంటే వెయ్యి మంది వచ్చినా రూ.ఒక లక్ష నుంచి రూ. లక్షన్నర ఖర్చవుతుందని సర్పంచ్ లు , కార్యదర్శులు వాపోతున్నారు.

భోజన ఖర్చులతోపాటు చెరువుల అలంకరణ, బతుకమ్మ, బోనాలు, లైటింగ్, ఇతరాత్ర ఖర్చుల కోసం మరో లక్ష రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక వేళ వసతులు సరిగా ఏర్పాటు చేయలేకపోయానా... భోజనాలు తక్కువ చేసిన గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తాయని వాపోతున్నారు. అసలే గ్రామ పంచాయతీలలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే దశాబ్ది ఉత్సవాలలో చెరువుల పండుగ పేరిట జీపీలపై మోయలేని భారం మోపతుందుని సర్పంచులు, కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story