సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

by Sridhar Babu |   ( Updated:2024-11-06 12:10:19.0  )
సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. కీసర మండలంలోని రాంపల్లి దాయర, గోధుమకుంట, శామీర్ పేట మండలం లోని అంతాయిపల్లిలలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,రాజకీయ, కుల సర్వేను జిల్లా అదనపు కలెక్టర్​ రాధికా గుప్తాతో కలిసి కలెక్టర్​ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) పూర్తయ్యేనాటికి ఖచ్చితమైన కుటుంబాల సంఖ్య రావాలని సూచించారు. ఇక్కడ ఇళ్లు ఉండి, ఇతర జిల్లాలలో నివాసముంటున్న వారు స్వచ్ఛందంగా ఎక్కడైనా ఒక చోట మాత్రమే వారి వివరాలు నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్యుమరేటర్లకు అవసరమైనచో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని నోడల్ అధికారులకు సూచించారు.

సర్వేకు సంబంధించిన ప్రొఫార్మలను భద్రపరిచేందుకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను, బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందించాలను సూచించారు. కలెక్టరు ఇంటింటికి అతికించిన స్టిక్కర్లను పరిశీలించి, సర్వేకు సంబంధించిన ప్రొఫార్మలను పరిశీలించారు. ఏ విధంగా నమోదు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారని, మీకు ఎన్ని ఇండ్లు కేటాయించారని సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సర్వేలో తదుపరి వివరాలను సేకరించేటప్పుడు కుటుంబ యజమానులు వారి ఆధార్, ఓటర్, అవసరమైన కార్డులను ఎన్యుమరేటర్లకు చూపించేలా తెలపాలన్నారు. సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు హాజరవుతున్నారా..? అని ఎంపీడీఓ గీన్యా నాయక్ ను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేలో ఇంటి యజమానుల వివరాలను కలెక్టర్​ నేరుగా అడిగి తెలుసుకొని, స్టిక్కర్ అతికించారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్సీ డెవలప్ మెంట్ ఆఫీసర్ వినోద్ కుమార్, కీసర ఎంపీడీఓ గీన్యా నాయక్, నోడల్ ఆఫీసర్ సుకీర్తి, తహసీల్దార్​ అశోక్ కుమార్, శామీర్ పేట్ తహసీల్దార యాదగిరిరెడ్డి, తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed