బోరుబావి కోసం రూ.35 వేలు లంచం డిమాండ్.. ప్రజావాణిలో ఫిర్యాదు..

by Sumithra |
బోరుబావి కోసం రూ.35 వేలు లంచం డిమాండ్.. ప్రజావాణిలో ఫిర్యాదు..
X

దిశ, ఘట్కేసర్ : బోరుబావి వేసుకోడానికి రూ.35 వేలు ఘట్కేసర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), సిబ్బంది లంచం తీసుకున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే ఘట్కేసర్ మండలం, కొర్రెముల గ్రామం లక్ష్మీ నగర్ కాలనీలో ప్లాట్ నెంబర్ 163బి యజమాని సోలిపురం చంద్రశేఖర్ రెడ్డి తన సొంత ప్లాటులో ఈనెల ఆరో తేదీన బోరు వేసుకుంటున్నాడు. అయితే అనుమతి లేకుండా బోర్ వేసుకోవడం చట్ట విరుద్ధమని ఘట్కేసర్ మండల ఆర్ఐ సాయిరాం, అతని సహాయకుడు మల్లేష్ పనులు నిలిపివేసి బోర్ వేసే లారీని మండల కార్యాలయం వద్ద తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే లారీని వదిలిపెట్టాలన్న బోర్ వేసుకోవాలన్నా రూ.20 వేలు డబ్బులు చెల్లించాలని లేదంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బెదిరించారని బాధితుడు తెలిపారు. ఈ విషయం ఇంచార్జ్ ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లగా తను ఆర్ఐని పిలిపించి మాట్లాడితే ఆర్ఐ పట్టించుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు అని తెలిపారు.

లంచం డబ్బులు రూ.50 వేలు ఇస్తేనే బోరు వేసే లారీ తాళం చెవి ఇస్తామని ఆర్ఐ సహాయకుడు మల్లేష్ డిమాండ్ చేశాడని ఆరోపించాడు. దీంతో చేసేది ఏమీ లేక అతి కష్టం పై రూ.35వేలు చెల్లించినట్లు తెలిపాడు. 7, 8 తేదీలు సెలవు రోజులు కావడంతో ఘట్కేసర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, సిబ్బంది అవినీతి పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న విషయం తెలుసుకున్న ఆర్ఐ తెలివిగా రూ.35 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారని అన్నారు. అన్యాయంగా తన వద్ద డబ్బులు తీసుకున్న రూ. 35 వేలు తనకు తిరిగి ఇప్పించాలని, అధికార దుర్వినియోగం చేసిన ఘట్కేసర్ మండల రెవెన్యూ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తన ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్ ఘట్కేసర్ మండల ఆర్ఐ సాయిరాంను సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఇన్చార్జి ఎమ్మార్వో, సిబ్బంది పై విచారణ చేపట్టాలని ఆర్డిఓకు సూచనలు చేసినట్లు తెలిపారు.

పెనాల్టీ వసూలు చేసాం.. లంచం కాదు

అనుమతి లేకుండా బోరుబావి వేస్తున్న సోలిపురం చంద్రశేఖర్ రెడ్డి నుంచి రూ.35 వేలు పెనాల్టీగా డబ్బులు వసూలు చేశామే కానీ లంచం కాదని ఘట్కేసర్ మండల ఆర్ఐ సాయిరాం వివరణ ఇచ్చారు. బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి ఆరోజు సాయంకాలం 4 గంటలు సమయం దాటిపోవడం, ఆ తర్వాత రెండు రోజులు సెలవులు రావడంతో ఆలస్యమైందని, సోమవారం ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు చెప్పారు. వివరాలన్నీ కూడా బాధితుడు ఎదురుగానే రెవెన్యూ రికార్డులలో నమోదు చేశామని సమాధానం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed