జిల్లాలో 80 శాతం చెరువుల స్థలాలు మాయం..!

by Nagam Mallesh |
జిల్లాలో 80 శాతం చెరువుల స్థలాలు మాయం..!
X

దిశ, మేడ్చల్ బ్యూరోః అక్రమార్కుల గుండెల్లో ’హైడ్రా‘ గుబులు రేపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల అక్రమణదారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు... ఎటువైపు నుంచి కూల్చివేతల కోసం బుల్డోజర్లు దూసుకువస్తాయోనని బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. కూల్చివేతల లిస్టులో మా అక్రమ నిర్మాణాలు ఉన్నాయా..? అని స్థానిక అధికార యంత్రాంగంతో అరా తీస్తున్నారు. తమకు తెలియదని స్థానిక అధికారులు తప్పించుకోవడంతో సమాచారం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. కూల్చివేతలు తప్పవని భావిస్తున్న కొందరు అక్రమార్కులు ముందుస్తుగా కోర్టును అశ్రయించి, స్టే కోసం ట్రై చేస్తున్నారు. కాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఇప్పటికే చెరువులో నిర్మించిన పలు భారీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, మరి కొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది.

నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం..

మేడ్చల్ జిల్లాలో 620 చెరువులు ఉన్నట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. గత పదేళ్లుగా జిల్లాలో చెరువుల సర్వే కొనసాగుతుండగా, ఇప్పటికి 543 చెరువుల సర్వే పూర్తి అయ్యింది. జిల్లా స్థాయి యంత్రాంగం సహకరించకపోవడం వల్ల చెరువుల పూర్తి స్థాయి నీటి నిల్వ(ఎఫ్ టిఎల్)గుర్తిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. పది సంవత్సరాల కాలంలో కేవలం ఇప్పటి వరకు 79 చెరువులకు మాత్రమే పూర్తి స్థాయి నీటి నిల్వను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేశారు. మరో 480 చెరువులు ఎఫ్ టీఎల్ గుర్తింపు ప్రాథమిక నోటిఫికేషన్ దశలోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

80 శాతం ఆక్రమణలే..

జిల్లాలోని 80 శాతం చెరువుల్లో ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లు ఆక్రమణకు గురయ్యాయి. కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి, కాప్రా, శామీర్ పేట, కీసర, ఘట్ కేసర్, నాగారాం, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి, అల్వాల్, హస్మత్ పేట, సూరారం, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల చెరువుల్లో వేలాది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే నిజాంపేట ఎర్రకుంట చెరువుతోపాటు, గాజులారామారం దేవేందర్ నగర్ లో చెరువు శిఖం భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. యాప్రాల్ నాగిరెడ్డి చెరువులో వెలసిన అక్రమ భారీ నిర్మాణాలను ఇటీవల హైడ్రా కమీషనర్ ఏ.వి.రంగనాథ్ పరిశీలించగా.. ఘట్ కేసర్ లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. అయితే తాను నిర్మించిన ప్రతి భవనానికి అనుమతులు ఉన్నట్లు అనురాగ్ విద్యా సంస్థల అధినేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొనడం విశేషం. అధికార యంత్రాంగం తప్పిదాల వల్ల ప్రతి దశలోనూ అనుమతుల ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టమవుతోంది. అక్రమార్కులతో కుమ్కక్కైన కొందరు అధికారులు చెరువుల ఎఫ్ టిఎల్ హద్దులను కూడా మార్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed