వక్ఫ్ బోర్డు కిరికిరి.. ఆగిన రిజిస్ట్రేషన్..

by Sumithra |
వక్ఫ్ బోర్డు కిరికిరి.. ఆగిన రిజిస్ట్రేషన్..
X

దిశ, పేట్ బషీరాబాద్ : నిన్న మొన్నటి వరకు అమ్మకాలు కొనుగోళ్ల పై రిజిస్ట్రేషన్స్ జరిగిన భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో వివిధ సర్వేనెంబర్లను పేర్కొంటూ అవి వక్ఫ్ బోర్డు భూములుగా తెలుపుతూ వాటి పై అమ్మకాలు కొనుగోళ్ల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని, ఉన్నతాధికారుల వద్ద నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని మూడు మండలాల్లో ఆయా సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి.

41 గుంటల కోసం...

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలలో వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొంటూ నిషేధిత ఉత్తర్వులు జారీ అవ్వగా వాటిలో కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 58 సర్వేనెంబర్ నుంచి 175 సర్వేనెంబర్ వరకు, అదేవిధంగా 177 సర్వే నెంబర్ నుంచి 226 సర్వే నెంబర్ల వరకు ఉన్న కేవలం 41 గుంటల భూమి బోర్డు పరిధిలోకి వస్తుండటంతో ఏకంగా 168 సర్వే నెంబర్ల పరిధిలో అమ్మకాలు కొనుగోలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఇదే రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 176 లో సైతం 3 ఎకరాల 25 గుంటలు వక్ బోర్డు భూమిగా నిషేధిత జాబితాలో చేరింది. దీంతో ఒక్క కుత్బుల్లాపూర్ గ్రామ పరిధిలో చాలా వరకు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి.

ఆగస్టు 27న ఉత్తర్వులు..

నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల పరిధిలో 302 ఎకరాల 22 గుంటల భూమి వక్ఫ్ బోర్డు భూమిగా పేర్కొంటూ ఆగస్టు నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే తేదీతో రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్లో సైతం అప్డేట్ చేశారు. అయితే ఈ ఉత్తర్వులు కాపీ 9 సెప్టెంబర్ 2024 నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావడం ఆ తర్వాత 13వ తారీకు నాడు కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆదేశాల అనుసారం రిజిస్ట్రేషన్స్ ఆపేయాల్సిందిగా అన్ని ఎస్ఆర్ఓ కార్యాలయాలకు ఉత్తర్వులను పంపించారు. దీంతో సెప్టెంబర్ 13వ తారీకు నుంచి విజేత జాబితాలో పేర్కొంటూ బోర్డు పరిధిలోకి వచ్చే భూములుగా చెబుతున్న ఆయా సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ నిలిచిపోయింది.

నిషేధాజ్ఞలు ఇచ్చారు కానీ.. లేని స్పష్టత..

నియోజకవర్గ వ్యాప్తంగా 302 ఎకరాల 22 గుంటల భూమిలో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను ఆపేయాలని పేర్కొంటూ ఆయా సర్వేనెంబర్ల తెలుపుతూ విస్తీర్ణాన్ని కూడా సూచిస్తూ నిషేధితాజ్ఞను జారీ చేయడం జరిగింది. అయితే ఫలానా సర్వే నెంబర్లు పేర్కొన్నప్పటికీ ఆ భూమి ఎక్కడ వస్తుంది ? ఏ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది ? తదితరు వివరాలను పేర్కొనలేదు. అత్యధికంగా ఈ తరహా స్పష్టత లేదని చెబుతున్నారు. ఉదాహరణకు బాచుపల్లి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 122 లో 28 గుంటల భూమి ఉండగా, దీనిలో నాలుగు సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఒక్కో డివిజన్ లో 9 గుంటలు, 5 గుంటలు భూమి ఉన్నట్లుగా పేర్కొనగా సర్వేనెంబర్ 122/1, 122/2 లో 23 గుంటల భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ భూమిని ఏ విధంగా గుర్తిస్తారు అన్న దానికి అధికారుల వద్ద సమాధానం లేదు. అంతేకాకుండా ఉత్తర్వులు కాపీలో కూడా ఆ భూమి ఎక్కడ వస్తుందో స్పష్టంగా పేర్కొనలేదు. ఒక్క బాచుపల్లి రెవెన్యూ పరిధిలోనే కాకుండా ఇతర గ్రామాల రెవెన్యూ పరిధిలో కూడా దాదాపుగా ఇదే విధంగా స్పష్టత లేకుండా ఉన్నది. పలానా సర్వేనెంబర్లు పలానా సబ్ డివిజన్ లో పలాన విస్తీర్ణంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుగా పేర్కొంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు.

ఆందోళనలో యజమానులు..

ఈ నెల 13 శుక్రవారం రోజున ఎస్ఆర్ఓలు ఉత్తర్వులను అందుకున్నారు. తదనంతరం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం జరిగింది. 18 వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చిన వారికి నిషేధిత జాబితాలో ఉన్న వివరాలు తెలిసేసరికి ఆందోళనకు గురయ్యారు. నియోజవర్గంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ గ్రామపరిధిలో ఉన్న 169 సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడంతో తీవ్ర చర్చ జరిగింది. నిషేధిత ఉత్తర్వుల పై చాలా అంశాలలో అధికారులు వద్ద కూడా పలు అనుమానాలు ప్రశ్నల పై సమాధానం లేదు. ఈ విషయం పై బీజేపీ నేత ఆకుల సతీష్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ సురేందర్ కు వినతిపత్రం అందజేశారు. స్పష్టతలేని ఆదేశాలిచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపణ చేశారు.

ఉన్నతాధికారులకు లేఖ రాశాం.. సురేందర్, ఎస్ఆర్ఓ, కుత్బుల్లాపూర్..

ఈ నెల 13 నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొంటున్న సర్వేనెంబర్లలో రిజిస్ట్రేషన్స్ ఆపేసాం. అత్యధికంగా కుక్బలాపూర్ గ్రామ పరిధిలో ఉన్న 169 సర్వేనెంబర్లలో ఇబ్బంది తీవ్రంగా ఉండటంతో ఈ సమస్య పై ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖ రాశాం. వారం పది రోజుల్లో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. మిగిలిన గ్రామాల సర్వేనెంబర్లలో ఆయా డాక్యుమెంట్స్ పూర్వపరాలను పరిశీలించి ఆమోదయోగ్యంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయటానికి ఆలోచిస్తాం.

Advertisement

Next Story

Most Viewed