నాలుగు లైన్ల పరీక్ష రాయనోడు ఉద్యోగాలను పీకేస్తాడా.. : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Shiva |
నాలుగు లైన్ల పరీక్ష రాయనోడు ఉద్యోగాలను పీకేస్తాడా.. : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

ఆరు నెలల్లో ప్రజలే ప్రభుత్వాన్ని పీకేసేస్తారు..

నై.. తెలంగాణ అన్నోళ్లకే పదవులు.. ఉద్యోగాలు

దిశ, మెదక్ ప్రతినిధి : ఏనాడు నాలుగు లైన్ల పరీక్ష రాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ కార్యదర్శులను పికేస్తా అంటూ బెదిరించడం ఏంటని, అరు నెలల్లో ప్రజలే ప్రభుత్వాన్ని పీకేస్తారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు సోమవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం అనే భావనతో పరీక్ష రాసి మెరిట్ తో వచ్చిన పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరితే విధుల్లో తక్షణం చేరకపోతే ఉద్యోగాలు పికేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు.

అంత ధైర్యం మంత్రి ఎర్రబెల్లికి ఉందా అంటూ సవాల్ చేశారు. మహిళ ఉద్యోగుల పట్ల మంత్రి వ్యవహరించిన తీరు రాష్ట్ర మొత్తం తెలుసని గుర్తు చేశారు. ఊగ్యోగులు అంటే గౌరవం లేని మంత్రి అంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. జీవితంలో మంత్రి పదవి కాదని సిద్ధాంతాన్ని మరిచి పార్టీ మార్చిన వ్యక్తి ఎర్రవల్లి కే దక్కిందన్నారు. పంచాయతీ కార్యదర్శులను పీకెస్తానన్న ఎర్రబెల్లికి వారి పక్షాన తాను వకాల్తా పుచ్చుకుంటానుంటూ సవాల్ విసిరారు. జిల్లాలో సీఎం, ముఖ్యమైన మంత్రులు ఉన్న జిల్లా కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

మంత్రి హరీష్ రావు గ్రామ సచివాలయంలో కూర్చొని సమస్యలు చూశారా అని ప్రశ్నించారు. తెలంగాణ కు అనేక అవార్డులు వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని... ఆ అవార్డుల వెనక ఎంత మంది పంచాయతీ కార్యదర్శుల కష్టం ఉందోనని తెలుసుకోవాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు కష్టపడి పని చేస్తున్నారని, అలాంటి వారు రెగ్యూలర్ చేయాలంటూ ముక్కుపచ్చలారని తన కొడుకు, కూతుళ్లను తీసుకుని టెంటు కింద కూర్చోవడం బాధకరనమి అన్నారు. జై తెలంగాణ అన్నోళ్లకు కేసీఆర్ దగ్గర ఏమి రావడం లేదని... సూటు వేసుకుని సూట్ కేసులు పట్టుకొచ్చినోళ్లకు అన్ని వస్తున్నాయని ఆరోపించారు.

2019 ఎన్నికలకు ముందు ఒక్క మహిళ మంత్రి లేని క్యాబినెట్ నడిపిచారని, స్థానిక మహిళ నేత తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఆమెకు అన్యాయం చేసి ఇతర పార్టీ నుంచి వచ్చిన మహిళకు మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఉద్యమంలో దెబ్బలు తిన్నాం.. తెలంగాణ వస్తే రాష్ట్రం వచ్చిన తెల్లారి నుంచి కాంట్రాక్ట్ అనే పదం ఉండదు ఆన్నా సీఎం కేసీఆర్ ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులను నాలుగేళ్లుగా రెగ్యూలర్ చేయకపోవడంతో వారు పలు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

33 జిల్లాల కలెక్టరేట్ ల వద్ద టెంట్లు వేసుకొని కూర్చున్న పంచాయతీ కార్యదర్శుల ఆందోళన ప్రభుత్వానికి పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను పీకేసే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి సహసానికి ప్రభుత్వం పాల్పడితే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజెపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మురళి యాదవ్, జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రవీణ్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed